విశ్లేషణ
దేశ ఆర్థిక వ్యవస్థకు గుండె కాయ వంటి బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం ఒక విలక్షణ మైన ‘రెపో’ సంక్షోభంలో చిక్కుకుంది. భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) అనుసరి స్తున్న ద్రవ్య విధానాలు ఒక వైపు రుణాల వృద్ధికి రెక్కలు ఇస్తుంటే, మరోవైపు డిపాజిట్ల సేకరణకు గడ్డుకాలం దాపురించేలా చేస్తున్నాయి. సాధా రణంగా వడ్డీ రేట్లు తగ్గితే ఆర్థిక కార్యకలాపాలు పుంజు కుంటాయి. అయితే అదే సమయంలో బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు నిల్వలు హరించుకుపోవడం ఇప్పుడు వ్యవస్థాగత స్థిరత్వానికి సవాలుగా మారింది.
ప్రస్తుత బ్యాంకింగ్ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, రుణాల విస్తరణకు, డిపాజిట్ల రాకకు మధ్య అగాథం స్పష్టంగా కనిపిస్తోంది. 2025 నవంబర్ నాటి గణాంకాల ప్రకారం, బ్యాంకుల రుణ వృద్ధి 11.42 శాతంగా నమోదు కాగా... డిపాజిట్ల వృద్ధి కేవలం 10.19 శాతా నికే పరిమితమైంది. ఈ 1.23 శాతం వ్యత్యాసం బేసిస్ పాయింట్ల లెక్కన చూస్తే 123 పాయింట్లు. 2024 అంతా నికి ఈ అంతరం కేవలం 0.58 శాతమే. అంటే ఏడాది కాలంలోనే నిధుల కొరత రెట్టింపు స్థాయికి చేరింది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 6.50 శాతం నుంచి 5.25 శాతానికి అంటే ఏకంగా 125 బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల... అప్పులు చౌకయ్యాయి.
అదుపు తప్పుతున్న క్రెడిట్–టు–డిపాజిట్ నిష్పత్తి
ఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం, బ్యాంకులు పంపిణీ చేసిన మొత్తం రుణాలు సుమారు రూ. 194 లక్షల కోట్లు ఉంటే, డిపాజిట్లు రూ. 241 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ వ్యవస్థలో క్రెడిట్ –టు–డిపాజిట్ నిష్పత్తి సాధారణంగా 75 నుండి 80 శాతం మధ్య ఉండాలి. కానీ ప్రస్తుతం ఇది 82 శాతానికి చేరింది. అంటే బ్యాంకులు సేకరిస్తున్న ప్రతి వంద రూపాయల్లో 82 రూపాయలను అప్పులుగా ఇచ్చేస్తు న్నాయి. మిగిలిన మొత్తంలో క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్‌ఆర్), స్ట్యాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్) వంటి చట్టబద్ధ నిల్వలను పక్కన పెడితే, బ్యాంకుల వద్ద అత్యవసర ద్రవ్య లభ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతోంది.
బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గడానికి ప్రధాన కారణం సామాన్యుడికి దక్కే వడ్డీ ఆశించిన స్థాయిలో లేక పోవ డమే. ముఖ్యంగా స్థిర ఆదాయంపై ఆధారపడే సీని యర్ సిటిజన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. బ్యాంకుల్లో దొరికే స్వల్ప వడ్డీ కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే మార్గాల వైపు ప్రజలు మళ్లుతున్నారు. మ్యూచు వల్ ఫండ్స్, షేర్ మార్కెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు నేడు ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్య స్థానాలుగా మారాయి. ప్రభుత్వ చిన్న పొదుపు పథ కాలు సైతం బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. దీనికి తోడు పెరిగిన విని యోగ వ్యయం కారణంగా ప్రజల చేతుల్లో పొదుపు చేసేందుకు మిగులు ఆదాయం తగ్గడం కూడా బ్యాంకు లకు ప్రతిబంధకంగా మారింది. బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలు, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ, యాన్యుటీ స్కీమ్‌లు ప్రవేశపెడుతున్నప్పటికీ, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం ముందు ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.
ద్రవ్య కొరత ప్రభావం
డిపాజిట్ల కొరత ఇలాగే కొనసాగితే బ్యాంకులు తమ ఆర్థిక అవసరాల కోసం బాండ్ మార్కెట్ లేదా అంతర్–బ్యాంక్ మార్కెట్ల నుంచి భారీ వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. రూపాంతర రహిత రుణపత్రాలు (నాన్ కన్‌వర్టిబుల్ డిబెంచర్స్), మౌలిక సదుపాయాల బాండ్ల ద్వారా నిధులు సేకరించడం వల్ల బ్యాంకుల నిర్వహణ వ్యయం భారమవుతుంది. ఇది బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడమే కాకుండా, అంతిమంగా ఖాతాదారులపైనే ప్రభావం చూపుతుంది. డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ పెంచితే, ఆటోమేటిక్‌గా రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగు తాయి. ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు గృహ, వ్యక్తిగత రుణాలను భారం చేస్తుంది. పర్యవసానంగా కొత్త పెట్టుబడులు తగ్గి ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం పొంచి ఉంది. అలాగే నిధులు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోకి విపరీతంగా ప్రవహించి అక్కడ ‘ఆస్తి బుడగలు’ ఏర్పడే అవకాశం ఉంది. ఇది విదేశీ పెట్టుబడులు తరలిపోవడానికీ, రూపాయి విలువ పడిపోవడానికీ దారితీయవచ్చు.
బ్యాంకుల్లో నిధులు తగ్గడానికి కేవలం వడ్డీ రేట్లే కారణం కాదు, వ్యవస్థపై నెలకొన్న అభద్రతా భావం కూడా ఒక ముఖ్య కారణం. గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ శక్తులు దాదాపు రూ. 1.70 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని ఎగ్గొట్టాయి. సైబర్ నేరగాళ్లు సామా న్యుల ఖాతాలను ఖాళీ చేస్తూ స్వైరవిహారం చేస్తున్నారు. లక్షల ఖాతాల నుంచి వేల కోట్ల రూపాయలు మాయమవుతుండటంతో హడలిపోతున్న పొదుపుదారులు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి వెనుకాడుతున్నారు.
పరిష్కారం దిశగా అడుగులు
ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ సమగ్ర వ్యూహంతో ముందుకు రావాలి. కేవలం రెపో రేట్ల మార్పులతోనే సరిపెట్టకుండా, డిపాజిట్ల వృద్ధిని ప్రోత్సహించేలా పన్ను రాయి తీలు లేదా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. రుణ ఎగవేతదారులు, సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసు కున్నప్పుడే ప్రజల్లో బ్యాంకులపై భరోసా కలుగుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ, బ్యాంకింగ్ స్థిరత్వం, తక్కువ వడ్డీకి రుణ లభ్యత అనే మూడు అంశాల మధ్య సమ తుల్యత సాధించడం దేశ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత కీలకం. బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు, డిపాజిట్లు అనేవి ఒకే బండికి ఉన్న రెండు చక్రాల వంటివి. ఒక చక్రం తిరుగుతూ రెండో చక్రం మొరాయిస్తే ఆ బండి గమ్యాన్ని చేరడం అటుంచి, ప్రమాదంలో పడుతుంది.
బోగా దీపిక
వ్యాసకర్త పరిశోధకురాలు


