బాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది. హీ మ్యాన్ ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఇంట్లోనే కన్నుమూశారు. ఈయన మృతి విషయాన్ని ఇంకా కుటుంబ సభ్యులు బయటపెట్టలేదు కానీ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే సినీ రాజకీయ ప్రముఖులు ఈయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇంతకీ ధర్మేంద్ర ఎవరు? ఆయన జీవితంలోని విశేషాలు ఏంటనేది ఈ స్టోరీలో చూద్దాం.
1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరం సింగ్ డియోల్. 1960ల నుండి 1980ల వరకు ఈయన నటించిన చిత్రాలు యాక్షన్, రొమాన్స్, కామెడీకి ఐకాన్‌గా నిలిచాయి. 300కు పైగా మూవీస్ చేసిన ఈయన ఎక్కువగా యాక్షన్ చిత్రాలతోనే మెప్పించారు. దీంతో అభిమానులు కూడా "యాక్షన్ కింగ్", "హీ-మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే (1975) చిత్రం ఆయన కెరీర్‌లో పెద్ద మలుపు. ఆ తర్వాత సీత ఔర్ గీత, చుప్కే చుప్కే, ధరమ్ వీర్ వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆయన ఎంతమంది దర్శకులతో చేసినా, అన్నీ వేటికవే వైవిధ్యభరితంగా ఉండటం విశేషం.
(ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు.. ధర్మేంద్ర కళ్లు చెదిరే సంపద)
బాలీవుడ్‌లలో కండలు తిరిగిన సౌష్టవంతో కనిపించి ఆరోజుల్లోనే ధర్మేంద్ర ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆరోజుల్లో చాలామంది అమ్మాయిల కలల రాకుమారునిగా నిలిచారు. ఏకంగా అందరి ‘డ్రీమ్ గర్ల్’గా పేరొందిన హేమామాలిని అంతటి అందాలతారను ఆయన తన సొంతం చేసుకున్నారు. ‘మేచో మేన్’గా పేరొందిన తొలినటుడిగా పేరుగాంచిన ధర్మేంద్ర.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ ప్రస్తుత ట్రెండ్ వరకు తన చిత్రాలకు కలెక్షన్స్ వర్షం కురిసింది. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండియా వరకు సుమారు రెండు దశాబ్దాల కాలం పాటు సినిమా పరిశ్రమలో ఎదురులేని మనిషిగా రాణించారు.
టాలెంట్‌తో తొలి ఛాన్స్
లూధియానా సమీపంలోని లాల్టోన్ కలాన్ అనే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ధర్మేంద్ర తండ్రి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. దీంతో ఆయన అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. చదువులు పెద్దగా చురుకుగా ఉండేవాడు కాదు. ఏదో రకంగా తన మెట్రిక్యులేషన్ పాసయ్యారు. అయితే, స్కూల్ రోజుల్లోనే స్టేజీలపై నాటకాలు వేయడం ఇష్టం. అప్పట్లో ‘పిలిమ్ ఫేర్’ మేగజైన్ కొత్తవారి టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ పోటీలో ధర్మేంద్ర విజేతగా నిలవడంతో కెరీర్ మలుపు తిప్పింది. ముంబైకి వస్తే సినిమా ఛాన్సులు ఇస్తామని వారు చెప్పడంతో అటువైపు అడుగులు వేశారు.
(ఇదీ చదవండి: ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?)
ముంబై వెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. కానీ, పట్టువదలకుండా అక్కడే ఉంటూ తన వేట సాగించారు. సరిగ్గా అలాంటి సమయంలోనే దర్శకుడు అర్జున్ హింగోరానీ కంటికి ధర్మేంద్ర పర్సనాలిటీ చూసి ఫిదా అయిపోయాడు. దీంతో తన సినిమాలో హీరోగా అవకాశం కల్పించారు. అలా తన మొదటి సినిమా ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’లో మెప్పించారు. అందులో బలరాజ్ సహానీ వంటి మేటి నటునితో కలసి ధర్మేంద్ర నటించడం విశేషం. అయితే, అనుకున్నంత రేంజ్‌లో ఈ మూవీ మెప్పించలేదు. ఆ తరువాత కొన్ని చిత్రాలలో సైడ్ హీరోగానూ నటించాల్సి వచ్చింది. 1962లో విడుదలైన ‘అన్ పడ్’ చిత్రం సూపర్ హిట అయింది. కానీ, 1966లో వచ్చిన ‘ఫూల్ ఔర్ పత్థర్’ చిత్రం ధర్మేంద్రను స్టార్ హీరోను చేసింది.

హేమమాలినితో ప్రేమ.. రెండో పెళ్లి
1970 ధర్మేంద్ర, హేమమాలినితో జోడీ మొదలైంది. వారిద్దరి కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజా-జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, చరస్, దోస్త్, మా, షోలే, ఆజాద్ వంటి సినిమాలు వారిద్దరి కాంబినేషన్‌లో సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, అప్పటికే ధర్మేంద్రకు పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ, హేమ మనసు ఆయనతో కలిసి అడుగులు వేయాలని కోరుకుంది. దీంతో వీరిద్దరూ 1980లో వివాహం చేసుకున్నారు. ఈ జోడికి జన్మించిన వారే ఇషా డియోల్, అహనా డియోల్ . ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌కు జన్మించిన వారిలో సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు. వారిద్దరూ కూడా హీరోలుగా మెప్పించారు. హేమామాలినితో పెళ్లి తర్వాత కూడా తన కుమారులని ఆయన దూరం పెట్టలేదు. నిర్మాతగా వారిద్దరిని హీరోలుగా పరిచయం చేస్తూ చిత్రాలు నిర్మించారు.
ధర్మేంద్ర కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ సత్తా చాటారు. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.
(ఇదీ చదవండి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మంద్ర జీవితంలోని స్పెషల్ ఫొటోలు)


