ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తేనే గౌరవం. కొరియోగ్రాఫర్ ఆట సందీప్‌కు కావాల్సినంత టాలెంట్ ఉంది. కానీ విజయం మాత్రం ఆవగింజంత కూడా లేదు. చాలాఏళ్లుగా ఆ సక్సెస్ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కొంతకాలం క్రితం డ్యాన్స్ స్టూడియో ప్రారంభించి భార్యతో కలిసి స్టూడెంట్స్‌కు డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల కిందట కెరీర్ మొదలుపెట్టిన సందీప్‌కు ఎట్టకేలకు సక్సెస్ దొరికింది. రోషన్ 'ఛాంపియన్' మూవీలో 'గిరగిర గింగిరానివే..', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్'లో 'హుక్ స్టెప్' పాటలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అతడి జర్నీ ఓసారి చూసేద్దాం..
సోషల్ మీడియాలో ఫేమస్
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్‌లో పాల్గొని విన్నర్‌గా నిలిచాడు సందీప్. అప్పటినుంచి అతడి పేరు ఆట సందీప్‌గా స్థిరపడింది. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేశాడు. సందీప్ భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్స్ మాస్టరే.. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే రీల్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ జంట టాలెంట్‌కు బోలెడన్ని సినిమా అవకాశాలు రావాలని అభిమానులు అభిప్రాయపడ్డారు.
గిరగిర గింగిరానివే.. పాటతో క్లిక్
సందీప్.. కొరియోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలు చేశాడు కానీ మంచి సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆమధ్య హీరోగా లవ్ యూ టూ అని ఓ మూవీ కూడా చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇక సందీప్ డ్యాన్స్ రీల్ చూసి ఛాంపియన్ మూవీ నిర్మాత స్వప్నదత్ ఓసారి అతడికి కాల్ చేసింది. తన సినిమాలో కొరియోగ్రఫీ చేయమని అడిగింది. అలా అతడి హిట్ లిస్ట్‌లో మొదటి పాటగా గిరగిర గింగిరానివే.. వచ్చి చేరింది. సందీప్ దంపతుల టాలెంట్ చిరంజీవికి కూడా తెలిసింది. వెంటనే ఆయన వీరిని ఇంటికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.
ఫేవరెట్ హీరోకి కొరియోగ్రఫీ
మన శంకర వరప్రసాద్ మూవీలో హుక్ స్టెప్ సాంగ్ చేయమని వరం ప్రసాదించాడు. అసలే సందీప్ ఫేవరెట్ హీరో ఆయన.. అలాంటిది పిలిచి మరీ అవకాశం ఇచ్చాక నిరూపించుకోకుండా ఉంటాడా? సింపుల్‌గా ఉంటూనే గ్రేస్ కనిపించేలా స్టెప్స్ క్రియేట్ చేశాడు. చిరు కూడా.. అంతే గ్రేస్‌గా, స్టైలిష్‌గా స్టెప్పులేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో సందీప్‌కు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 18 ఏళ్ల తర్వాత ఇంత మంచి విజయం రావడంతో.. ఇన్నేళ్లుగా పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాడు. అనుకున్నది సాధించానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరి అతడికి మున్ముందు కూడా మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం..
చదవండి: ది రాజాసాబ్‌లో ఆ సీన్స్ డిలీట్


