100 ఎకరాల ఫామ్‌ హౌస్‌, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద | Dharmendra Net Worth Rs 335 Crore Empire, Farmhouse And Luxury Cars | Sakshi
Sakshi News home page

100 ఎకరాల ఫామ్‌ హౌస్‌, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద

Nov 11 2025 4:18 PM | Updated on Nov 11 2025 5:00 PM

Dharmendra Net Worth Rs 335 Crore Empire, Farmhouse And Luxury Cars

ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర (89)పై వస్తున్న అనేక ఫేక్‌ న్యూస్‌ మధ్య ఆయన కోలుకుంటున్నారనే వార్త ఎంతోమంది అభిమానులకు ఊరట నిచ్చింది. ఫూల్ ఔర్ పత్తర్, మేరా గావ్ మేరా దేశ్, షోలే, ఖామోషి, జానీ గద్దర్, ఇలాంటి ఎన్నో  బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో బాలీవుడ్‌ ఐకాన్‌గా నిలిచారు. కళా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు ధర్మేంద్ర. అయితే తాజాగా ఆయన ఆస్తి ఎంత  అనేది  నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

అసలైన హీ-మ్యాన్‌గా పాపులర్‌ అయిన ధర్మేంద్ర, బాలీవుడ్‌లోని అత్యంత ధనిక  స్టార్స్‌ లో ఒకరు. నటనతోపాటు ఆయన వ్యాపారం రంగంలోకూడా తనదైన ముద్రను వేసుకున్నారు.   2015లో న్యూఢిల్లీలోని గరం ధరం ధాబాతో రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు ధర్మేంద్ర. 2022లో, కర్నాల్ హైవేలో హీ-మ్యాన్ అనే మరో  హోటల్‌ను కూడా స్థాపించారట.

100 ఎకరాల విశాలమైన ఫామ్‌హౌస్
ధర్మేంద్ర తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నప్పటికీ, నగరానికి దూరంగా ప్రశాంతతకు మారు పేరైన లోనావాలాలో విశాలమైన 100 ఎకరాల ఫామ్‌హౌస్‌ ఉంది.  ఆధునిక సౌకర్యాలతో ముఖ్యంగా ఆక్వా థెరపీ తీసుకునేందుకు వీలుగా వేడి నీటితో కూడిన స్విమ్మింగ్ పూల్  ఉండే ఇక్కడికి తరచూ వెళుతూ ఉంటారు కూడా. అంతేకాదు ఇక ఒక రిసార్ట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా హాస్పిటాలిటీ వ్యాపారంలోకి మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

పలు నివేదికల ప్రకారం ధర్మేంద్రకు మహారాష్ట్రలో రూ.17 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. రూ.88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమి, రూ.52 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉన్నాయి.  ఒక  రెస్టారెంట్ చైన్‌తో భాగస్వామ్యంతో  12 ఎకరాల స్థలంలో 30-కాటేజ్ రిసార్ట్‌ను నిర్మించారుట. ఇలా ధర్మేంద్ర మొత్తం ఆస్తుల విలువ రూ. 335 కోట్లు ఉంటుందని అంచనా. 

ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం

లగ్జరీ కార్లు 
లగ్జరీ కార్లు అంటే  ధర్మేంద్రకు  చాలా ఇష్టం.  ఆయన దగ్గరున్న అద్భుతమైన  కార్ల కలెక్షనే ఇందుకు నిదర్శనమంటారు.  వింటేజ్ ఫియట్ కారు విలువ రూ. 85.74 లక్షలు. రూ. 98.11 లక్షల విలువైన  రేంజ్ రోవర్ ఎవోక్  మెర్సిడెస్-బెంజ్ SL500 వంటి ఆధునిక లగ్జరీ కార్లతో  అతని గ్యారేజ్ నోస్టాల్జియా , ఐశ్వర్యానికి ప్రతిబింబంగా ఉంటుంది. 

ప్రొడక్షన్ హౌస్
నటనతో పాటు, ధర్మేంద్ర నిర్మాతగా కూడా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు.. 1983లో తన నిర్మాణ సంస్థ విజయ్తా ఫిల్మ్స్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్ కింద, అతను తన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లను బేతాబ్ (1983), బర్సాత్ (1995) సినిమాలతో వరుసగా విజయ వంతమైన అరంగేట్రాలతో బాలీవుడ్‌కు పరిచయం చేశారు. 2019లో తన మనవడు కరణ్ డియోల్‌ను తొలి చిత్రం పాల్ పల్ దిల్ కే పాస్‌ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 

ధర్మేంద్రకు రెండు పెళ్లిళ్లు.  సినీ జీవితంలోకి అడుగుపెట్టకముందే 1954లో ప్రకాష్ కౌర్‌ పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. బాలీవుడ్‌ స్టార్‌హీరోగా మారిన తరువాత ప్రకాష్ కౌర్ నుంచి విడాకులు తీసుకోకుండానే 1980లో డ్రీమ్‌గర్ల్‌ హేమా మాలినిని వివాహం చేసుకున్నారు. వీరికి ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement