ముంబై: బహిరంగ ప్రదేశంలో పావురాలకు ఆహారం (తిండి గింజలు) చల్లిన వ్యాపారవేత్తకు ముంబై కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారని కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ముంబై నగరంలో పలు ప్రాంతాల్లో పావురాలకు గింజలు చల్లడంపై నిషేధం అమలులో ఉంది.
నగరంలోని మహిమ్ ప్రాంతంలో ఈ ఏడాది ఆగస్టు 1న దాదర్ నివాసి నితిన్ సేథ్.. పావురాలకు తిండి గింజలు వేశారు. ఆయనపై కేసు నమోదైంది. పావురానికి ఆహారం ఇచ్చే విషయం కోర్టుకు చేరుకుంది. డిసెంబర్ 22వ తేదీన ఆ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వీయూ మిసాల్ ఆ వ్యాపారవేత్తను దోషిగా తేల్చారు. అయితే క్షమాపణ కోరడంతో అతనికి కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది.
బహిరంగంగా పావురాలకు ఫీడింగ్ చేయడం వల్ల ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 ఉల్లంఘించినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. ఆయనపై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 271 కింద కూడా కేసు నమోదు చేశారు.


