అయ్యప్పస్వామి మండల దీక్ష పూజకు సమయం సమీపిస్తున్న వేళ శబరిమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. మణికంఠ స్వామిని ఇప్పటివరకూ దర్శించుకున్న భక్తుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అయ్యప్పస్వామి అభరణాల ఊరేగింపు "తంగాఅంకి" సందర్భంగా నేడు ( శుక్రవారం) నుంచి పలు ఆంక్షలు విధించినట్లు అధికారులు ప్రకటించారు.
అయ్యప్పస్వామి మండలి పూజ డిసెంబర్ 27న జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధానానికి భక్తుల రద్దీ పెరిగింది. డిసెంబర్ 25, 2025 నాటికి స్వామివారిని 30,01,532 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే గతేడాది ఈ సంఖ్య 32,49,756 గా ఉందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొద్దిమేర తగ్గినట్లు తెలిపారు.
కాగా అయ్యప్పస్వామికి అభరణాల ఊరేగింపు ఉత్సవానికి అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కుంబజా, పలమారుర్ వంచిప్పాడి, పులిముక్కు, ఇలకొల్లూర్ తదితర ప్రాంతాలలో స్వామివారి అభరణాల ఊరేగింపు సందర్భంగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా రేపు శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మండల పూజ ముగింపు కార్యక్రమం ఉంటుంది.


