వినియోగదారుల భద్రతను.. ఇండోర్ గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అగర్‌బత్తులకు బీఐఎస్ ప్రమాణాలు ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి 'ప్రహ్లాద్ జోషి' కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ''ఐఎస్ 19412:2025 – అగరుబత్తి - స్పెసిఫికేషన్''ను విడుదల చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం.. అగర్‌బత్తులలో వినియోగదారుల ఆరోగ్యం, ఇండోర్ గాలి నాణ్యతకు, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని క్రిమిసంహారక రసాయనాలు & సింథటిక్ సువాసన పదార్థాల వాడకం పూర్తిగా నిషేధం. జాబితాలో అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ & ఫిప్రోనిల్ వంటి కొన్ని క్రిమిసంహారక రసాయనాలు.. అలాగే బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ & డైఫెనిలమైన్ వంటి సింథటిక్ సువాసన పదార్థాలు ఉన్నాయి.
కొత్త ప్రమాణాలు.. అగర్‌బత్తులను యంత్రాలతో తయారు చేసినవి, చేతితో తయారు చేసినవి మరియు సాంప్రదాయ మసాలా వర్గాలుగా వర్గీకరిస్తుంది. అంతే కాకుండా.. ముడి పదార్థాలు, బర్నింగ్ నాణ్యత, సువాసన పనితీరు & రసాయన పారామితుల కోసం స్పెసిఫికేషన్లను నిర్దేశిస్తుంది. దీంతో అగర్‌బత్తులు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. ఇవి మానవ, పర్యావరణ హితంగా ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా.. మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది.
అగర్‌బత్తుల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్..
ప్రపంచంలో అగర్‌బత్తుల ఉత్పత్తి & ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటకలోని మైసూరు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అగరుబత్తీ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోంది. మన దేశం సుమారు 150 దేశాలకు అగర్‌బత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.


