
తీవ్రస్థాయిలో రసాయన మూలకాలు
మానవ ఆరోగ్యానికి హానికారకాలు
నల్లగొండ జిల్లాను వెంటాడుతున్న ఫ్లోరైడ్, గద్వాలలో క్లోరైడ్, నాగర్‌కర్నూల్‌లో నైట్రేట్ తీవ్రత
కేంద్ర జలశక్తి శాఖ సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూగర్భ జలాల్లో పరిమితులకి మించి ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్‌తోపాటు ఇతర రసాయన మూలకాలున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల పరిశీ లన కోసం బావుల నుంచి 2024లో వానాకాలానికి ముందు 412, వర్షాల తర్వా త 375 నీటి నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని రీజనల్ కెమికల్ ల్యాబొరేటరీలో పరీక్షించి ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది. చాలా జిల్లాల్లోని భూగర్భ జలాల్లో మనుషుల ఆరోగ్యానికి హానికరమైన మూలకాలు న్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. రాష్ట్రంలోని భూగర్భ జలాలు ప్రధానంగా క్యాల్షియం బైకార్బొనేట్ రసాయన పదార్థాన్ని అధిక మోతాదులో ఉన్నట్టు తేలింది. అధిక మోతాదులో క్యాల్షియం తీసుకుంటే మూత్రపిండాలు, మూత్రా శయంలో రాళ్లు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని కేంద్రం తెలిపింది.
19% జలాల్లో మోతాదుకి మించి ఫ్లోరైడ్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల ప్రకారం లీటర్ నీళ్లలో మిల్లిగ్రామ్ కంటే తక్కువగా ఫ్లోరైడ్ ఉంటేనే తాగడానికి అత్యంత సురక్షితమైన నీటిగా పరిగణిస్తారు. వర్షాలకి ముందు తీసిన 252 నమూనాలు (61.2శాతం), వర్షాకాలం తర్వాత తీసిన 252 నమూనాలు(67.2శాతం) ఈ పరిమితికి లోబడే ఉన్నాయి. లీటర్ నీళ్లలో 1.01–1.5 మిల్లీగ్రామ్ ఫ్లోరైడ్ ఉంటే అనుమతించదగినదిగా భావిస్తారు. వర్షాకాలానికి ముందు తీసిన 79 నమూనాలు (19.2శాతం), వర్షాకాలం తర్వాత తీసిన 50 నమూనాలు (13.3శాతం) ఈ మేరకు అనుమతించదగిన స్థాయిల్లో ఫ్లోరైడ్‌ను కలిగి ఉన్నట్టు తేలింది.
వర్షాకాలానికి ముందు తీసిన 81 నమూనాలు(19.7శాతం), వర్షాకాలం తర్వాత తీసిన 73 నమూనాలు(19.5శాతం) అనుమతించదగిన స్థాయికి మించి ఫ్లోరైడ్‌ను కలిగి ఉన్నట్టు నిర్థారణ జరిగింది. తాగునీళ్లలో అధిక మోతాదులో ఫ్లోరైడ్ ఉంటే మనుషులను ఎముకుల గూళ్లుగా మార్చే ఫ్లోరోసిస్ అనే వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. దంతాల సమస్యలూ ఉత్పన్నమవుతాయి.
ఫ్లోరైడ్ నల్లగొండలోనే అత్యధికం..
నల్లగొండ జిల్లాలో వర్షాలకి ముందు తీసిన భూగర్భ జలాల నమూనాల్లో అత్యధికంగా లీటర్‌కి 5.84 మి.గ్రా. ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలోనే అత్యధిక పరిమాణంలో ఫ్లోరైడ్ కలిగి ఉన్న జిల్లా ఇదే. అయితే, వర్షాల తర్వాత 3.55 మి.గ్రా.కు తగ్గింది. ఇతర జిల్లాల్లో చూస్తే.. వర్షాలకి ముందు యాదాద్రి భువనగిరిలో 4.42, వర్షాల తర్వాత 2.69.. వరంగల్‌లో వర్షాలకి ముందు 2.48, వర్షాల తర్వాత 5.59, హన్మకొండలో వర్షాలకి ముందు 4.34, వర్షాల తర్వాత 2.34, ఆదిలాబాద్‌లో వర్షాలకి ముందు 3, వర్షాల తర్వాత 5.5 మి.గ్రా. ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. రాష్ట్రంలో పరిమితికి మించి ఫ్లోరైడ్ కలిగిన జిల్లాలు 2017లో 26 ఉండగా, 2024లో 24కి తగ్గాయి.
గద్వాలలో అత్యధికంగా క్లోరైడ్
బీఐఎస్ ప్రమాణాల ప్రకారం లీటర్‌కి 250 మిల్లీగ్రామ్ క్లోరైడ్ కలిగిన జలాలను సరక్షితమైనవిగా పరిగణిస్తారు. ప్రత్యామ్నాయ తాగునీటి సదుపాయం లేని ప్రాంతాల్లో లీటర్‌కి 1000 మి.గ్రా. వరకు ఫ్లోరైడ్‌ను అనుమతిస్తారు. క్లోరైడ్ పరిమాణం అంతకు మించితే నీళ్లు తాగడానికి పనికిరావు. వర్షాకాలానికి ముందు జరిపిన పరీక్షల్లో రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాలో లీటర్ భూగర్భజలాల్లో ఏకంగా 7657 మి.గ్రా. క్లోరైడ్ ఉన్నట్టు తేలింది. ఇతర జిల్లాల్లో పరిశీలిస్తే నల్లగొండలో 2947, భువనగిరిలో 884, సంగారెడ్డిలో 869, రంగారెడ్డిలో 794, మెదక్‌లో 716, ఖమ్మంలో 714, నాగర్‌కర్నూల్‌లో 554 మి.గ్రా. క్లోరైడ్ ఉన్నట్టు నిర్థారణ జరిగింది. గుండె, మూత్రపిండాలు, అజీర్ణం వంటి రోగాలతో బాధపడే వారికి మోతాదుకి మించిన క్లోరైడ్ ప్రమాదకరం.
జూపల్లిలో నైట్రేట్ తీవ్రత అధికం..
బీఐఎస్ ప్రమాణాల ప్రకారం గరిష్టంగా లీటర్‌కి 45మి.గ్రా. నైట్రేట్ కలిగి ఉన్న జలాలనే తాగడానికి సురక్షితంగా పరిగణిస్తారు. అధిక మోతాదులో నైట్రేడ్ కలిగి ఉన్న తాగునీటితో నవజాత శిశువుల్లో మెథెమోగ్లోబినెమియా అనే రక్త రుగ్మత, పెద్దల్లో ఉదరకోశ క్యాన్సర్లతోపాటు కేంద్ర నాడి వ్యవస్థపై తీవ్ర దుష్రభావం చూపుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని జూపల్లిలో అత్యధికంగా వర్షాలకి ముందు లీటర్‌కి 249.6 మి.గ్రా.లు, వర్షాల తర్వాత లీటర్‌కి 533.2 మి.గ్రా. నైట్రేట్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో 34.7శాతం మోతాదుకి మించి నైట్రేట్‌ను కలిగి ఉన్నట్టు వెల్లడైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మినహా అన్ని జిల్లాల్లోని భూగర్భ జలాలు మోతాదుకి మించి నైట్రేట్‌ను కలిగి ఉన్నాయి.