
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఆధ్వర్యంలో బేగంపేట ద మనోహర్ హోటళ్లో జరిగిన ప్రపంచ ప్రమాణాల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు పథకంలో బీఐఎస్ రూపొందించిన నేషనల్ బిల్డింగ్ కోడ్‌ను పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఇతర పనుల్లోనూ ప్రతిచోటా నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ స్థాపించిన ఈ శాఖ.. 79ఏళ్లలో దేశంలో 23వేలకు పైగా భారతీయ ప్రమాణాలను రూపొందిచండం గొప్ప విషయమని కొనియాడారు.
నిత్య వినియోగ వస్తువులపై ఐఎస్ఐ మార్కు, బంగారు, వెండి ఆభరణాలపై హాల్‌మార్కు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై రిజిస్ట్రేషన్ మార్కులు వినియోగదారులకు విశ్వాసాన్నిస్తున్నాయని తెలిపారు. ప్రతి పౌరుడూ బాధ్యతగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని.. బీఐఎస్ ధ్రువీకరించిన వస్తువులు మాత్రమే కొనాలని మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటైందని.. ప్రమాణాల పెంపునకు ఈ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. స్టాండర్డ్ క్లబ్స్ ద్వారా విద్యార్థుల్లో నాణ్యతపై అవగాహన కల్పించే బీఐఎస్ ప్రయత్నాన్ని అభినందించారు.
రాష్ట్రస్థాయి పురస్కారాలు
జి ప్రసన్న కుమారి, తెలంగాణ మోడల్ స్కూల్, మహేశ్వరం, బండారి రజిత, పీఎం శ్రీ జెడ్‌పీ హైస్కూల్, శ్రీదేవి, జెడ్పీ హైస్కూల్, తీగలగుట్టపల్లి, కరీంనగర్ లను ఉత్తమ మెంటార్లుగా మంత్రి సత్కరించారు. జెడ్పీ హైస్కూల్ ధర్మారావుపేట, కామారెడ్డి విద్యార్థులకు మానక్ వీర్ పురస్కారాల్ని అందజేశారు. వీరితో పాటు పలు ఉత్తమ పరిశ్రమలనూ మంత్రి సత్కరించారు. రాష్ట్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాల పెంపులో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ప్రభుత్వ శాఖలు.. కార్మిక శాఖ, టీజీఎస్‌పీడీసీఎల్ లను మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది పరిశ్రమ, విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, వినియోగదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.