మనసు బాగుంటే..మెరుపు గ్యారంటీ! | Side effects of mental stress on the face | Sakshi
Sakshi News home page

మనసు బాగుంటే..మెరుపు గ్యారంటీ!

Feb 11 2026 4:39 AM | Updated on Feb 11 2026 4:39 AM

Side effects of mental stress on the face

కోపతాపాలు కొరివి దెయ్యాలు; ముఖంపై పడే దుష్ప్రభావాలు 

ప్రశాంతతను మించిన మేకప్‌ లేదు

దివ్యౌషధాలన్నీ దేహంలోనే

ఒత్తిడి వద్దంటున్న నిపుణులు

ఎన్ని క్రీములు వాడినా మొటిమలు తగ్గడం లేదా? అయితే సమస్య మీ చర్మంలో లేదు. మీ మైండ్‌లో ఉంది! ముఖానికి ఎన్ని మెరుగులు దిద్దినా ‘గ్లో’ రావటం లేదా? అందుకు కూడా కారణం మీ మెదడే అంటున్నారు వైద్య నిపుణులు. 

విషయం ఏంటంటే..
మీ చర్మం కేవలం ఒక పొర మాత్రమే కాదు. అది మీ లోపల మసులుతున్న భావోద్వేగాలను ప్రదర్శించే ఒక పెద్ద డిజిటల్‌ బోర్డు కూడా. ఎంత కడిగి, ఎంత రుద్ది, ఎన్ని లేపనాలు పూసినా మీ ముఖ చర్మం కాంతి విహీనంగా ఉంటోందంటే.. దోషం మీ మేకప్‌ కిట్‌లో కాకుండా, మీ కోపతాపాల్లో ఉందేమో ఒకసారి చెక్‌ చేసుకోండి!

ఎమోషనల్‌ లగేజీ
అందం అనేది చర్మంపై కనిపించేదే అనుకుంటాం. కానీ మానసిక ఒత్తిడి చర్మాన్ని మసకబార్చి, ఎముకల దాకా వెళ్తుంది. మీరు ఎప్పుడూ కోపంతో రగిలిపోతుంటే, మీ బాడీ ‘కార్టిసో ల్‌’ అనే హార్మోన్స్ ను విచ్చలవిడిగా విడుదల చేస్తోందని అర్థం. అది మీ మూడ్‌ని పాడు చేయడమే కాదు, ముఖాన్ని ఆయిలీగా మార్చేసి, మొటిమలకి ఘన స్వాగతం పలుకుతుంది.

భయం కూడా అంతే!
మీలోని భయం మీ శరీరాన్ని ఎప్పుడూ ‘యుద్ధం’ చేసే ఒత్తిడి మూడ్‌లో ఉంచుతుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. జుట్టు రాలడం మొదలవుతుంది. అంటే, పులి వచ్చి మీద పడబోతోందన్న భయంలో మీ శరీరం తత్తరపాటుగా ఉండి, అందాన్ని పట్టించుకోవడం మానేస్తుందన్నమాట!

మీ లోపలే దివ్యౌషధాలు!
అదృష్టవశాత్తూ మీలోనే ఒక ‘ల్యాబొరేటరీ’ ఉంది. అది మీ చర్మాన్ని కాంతివంతం చేసే హార్మోన్‌లను తయారు చేస్తుంటుంది. ఖరీదైన సౌందర్య సాధనాల అవసరం లేకుండానే, మీ శరీరం ఉత్పత్తి చేసే నాలుగు హ్యాపీ హార్మోన్‌లతో మీ చర్మం పదికాలాలు కాంతులీనుతుంది. 

నవ్వు రాకున్నా నవ్వండి
మీకు అసలు నవ్వు రాకపోయినా, అప్పుడప్పుడు కావాలని నవ్వండి. మీరు నవ్వగానే మీ మెదడు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఫీలయ్యి డొపమైన్‌ను, సెరోటోనిన్  విడుదల చేస్తుంది. దీనికి కొంచెం కృతజ్ఞత, ఇంకొంచెం సంతృప్తి తోడైతే అది మీకు మీరు చేసుకునే ఒక ఉచిత ‘బయోలాజికల్‌ ఫేషియల్‌’ అవుతుంది. పది రకాల స్కిన్‌ కేర్‌ టిప్స్‌ ఫాలో అయ్యే కంటే, ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడం సాధన చెయ్యండి. కడిగితే పోని ఏకైక మేకప్‌.. మీ ‘ప్రశాంతమైన మనసు’ మాత్రమే అని గుర్తించండి! 

ప్రశాంతంగా ఉండాలి
ఆందోళన, ఒత్తిడి, ఇతర మానసికమైన సమస్యలు ఏవైనా చర్మ సౌందర్యంపై తప్పక ప్రభావం చూపుతాయి. భావోద్వేగ స్థితిలో ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిజాల్, ఎడ్రినలిన్  వంటి రసాయనాలు వెలువడతాయి. అవి మన హార్మోన్ల అసమతౌల్యతకు కారణమవు తాయి. 

ఎమోషనల్‌ డిస్ట్రబెన్స్‌ల వల్ల జుట్టు రాలిపోవడం, చర్మంపై నల్లమచ్చలు రావడం వంటి ఇతర సమస్యలూ తలెత్తే అవకాశాలూ ఉంటాయి. అలాగే, చర్మంలో నిగారింపు తగ్గి, కాంతి విహీనం అవుతుంది. వ్యాధి నిరోధకత తగ్గడంతో ఇన్ఫెక్షన్లకూ ఆస్కారముంటుంది. అందుకే చర్మాన్ని సంరక్షించుకోవటానికి మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండడం, ప్రశాంతంగా గడపడం చాలా ముఖ్యం.   – డాక్టర్‌ స్వప్న ప్రియ, సీనియర్‌ డెర్మటాలజిస్ట్‌

నాలుగు ‘హ్యాపీ హార్మోన్‌’లు
డొపమైన్‌: ఇదొక ‘గోల్‌–గెట్టర్‌’ (లక్ష్యసాధకుడు) లాంటిది. వ్యాయామం చేసినా, ఏదైనా చిన్న పని విజయవంతంగా పూర్తి చేసినా, మ్యూజిక్‌ విన్నా ఇది విడుదల అవుతుంది.
ఎండార్ఫిన్లు: ఇవి శరీరం విడుదల చేసే సహజసిద్ధ నొప్పి నివారిణులు. (పెయిన్‌ కిల్లర్స్‌). నవ్వినా లేదా కొంచెం డార్క్‌ చాక్లెట్‌ తిన్నా ఇవి ఉబికి వస్తాయి. 
ఆక్సిటోసిన్‌: ఇది ప్రేమను పంచే హార్మోన్‌. ఎవరినైనా ఆత్మీయంగా హత్తుకున్నా, పెట్‌ యానిమల్స్‌తో ఆడుకున్నా ఇది ఉత్పత్తి అవుతుంది.
సెరొటోనిన్‌: ఇది మీ మూడ్‌ మెకానిక్‌. సూర్యరశ్మి, మెడిటేషన్‌ ద్వారా దీన్ని సెట్‌ చేసుకోవచ్చు.

మీ అందానికి శత్రువులు – వాటి ప్రభావాలు

 

Advertisement
 
Advertisement
Advertisement