మాస్కింగ్
‘వాళ్లతో కష్టం లేండి’ అంటుంటారు... ఉన్నదున్నట్టుగా మాట్లాడేవాళ్లను ఉద్దేశించి. సమాజంలో ‘ముసుగు’ వేసుకుని ఉండటం అవసరం. ఇష్టం ఉన్నా లేకున్నా అనుకూల వైఖరితో వ్యవహరిస్తే యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇది పురుషాధిపత్య సమాజం. అందుకే స్త్రీలు ఇంటా, బయట తమకు నచ్చినా నచ్చకపోయినా ‘మనసుకు ముసుగు వేసి’ లోన దుఃఖం ఉన్నా పైకి నవ్వుతూ కనిపించాలి. ఇది ఒక మేరకు మంచిదే అయినా కాలక్రమంలో మనసుకు వొత్తిడి తప్పదంటున్నారు మానసిక నిపుణులు.
చిన్నప్పుడు గుర్తు చేసుకోండి. ఏదైనా నచ్చక ఏడిస్తే పెద్దవాళ్లు తిడతారు. అల్లరి చేస్తే తిడతారు. బంధువులు వచ్చినప్పుడు చనువుగా ఉంటే తిడతారు. లేకపోయినా తిడతారు. దీన్నిబట్టి ‘మెదడు’కు అందే సజెషన్ ఏమిటి? నువ్వు నీలా కాదు... ఎదుటివాళ్లకు నచ్చేలా ఉండటమే బెటర్ అని. ఆడపిల్లకైతే ఇలా భావాలను లోపల దాచుకోవడం చిన్నప్పటి నుంచే నేర్పుతారు. ఇదే పెరిగి పెద్దదయ్యే కొద్దీ స్వభావంగా మారుతుంది.
లోక రీతికి తగినట్టుగా, కామన్‌సెన్స్‌తో కొన్ని మనసులో దాచుకొని వ్యవహరించడం ప్రతి ఒక్కరూ చేసేదే. అయితే వ్యక్తిగతానికి వచ్చినప్పుడు... లేదా కుటుంబపరంగా, సామాజికంగా ఒక విషయంపై లోపల ఒక విధంగా ఉన్నా పైకి మరో విధంగా వ్యవహరించాల్సి వస్తే దానిని ‘మాస్కింగ్’ అంటారు సైకాలజీ పరిభాషలో. అంటే ముసుగు వేయడం.
పురుషులు తమ లోపల ఉన్న అసూయ, భయం, పిరికితనం, కోపం, అయిష్టాలను పైకి కనిపించనీయకుండా ముసుగు వేస్తారు నిజమే కానీ వారి కంటే స్త్రీలు ఈ విషయాలను ఎక్కువగా దాచుకొని మసలాల్సి వస్తుందని మానసిక శాస్త్ర పరిశోధనల్లో తేలింది. చదువు, పెళ్లి, కాపురం, ఉద్యోగం, స్నేహితులు, బంధువులు, ఆర్థికం... ఇలా అనేక విషయాల్లో స్త్రీలు తమ లోపల ఉన్న భావాలను దాచుకుని ముసుగు వేసుకొని బతుకుతారని, దానికి కారణం ఆ భావాలు బయటకు వెల్లడి చేస్తే మేలు కన్నా కీడు అధికమని అనుకోవడమే. ఇంత ఆధునిక కాలంలో కూడా ‘ఇష్టం లేని పెళ్లి వద్దు’ అని చెప్పే వీలు ఆడపిల్లలకు ఎంతమందికి ఉంది? వద్దని చెప్పినా ఉపయోగం ఉండదని మనసు మీద ముసుగు వేస్తారు.
పరిస్థితులను గట్టెక్కించడానికి ఇలా ‘ముసుగులు వేసుకోవడం’ కొంతవరకూ మంచిదే కాని సుదీర్ఘ కాలం ఇదే వైఖరి కొనసాగితే స్త్రీలలో మానసిక జడత్వం వచ్చే అవకాశం ఉందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆడవాళ్లు మేధో ఆలోచనలు, అత్యద్భుతమైన తెలివితేటలతో పుట్టినా అవన్నీ ఈ ముసుగు వేసే స్వభావం వల్ల సన్నగిల్లుతాయని ఒక రకంగా ‘అన్‌రికగ్నైజ్డ్ ఆటిజమ్’కు లోనవుతారని అంటున్నారు. అంతేకాక విపరీతమైన అలసట, స్వయంగా ఆపాదించుకునే అనారోగ్యాలు వీరిని బాధిస్తాయట.
మంచీ ఉంది.. చెడూ ఉంది
పిల్లలు లోకం మెచ్చే వైఖరులతో పెరగాలని తల్లిదండ్రులు భావిస్తారు. కొత్త ఆలోచనలు, ప్రయోగాలు, ఇష్టాలు మనసులో ఉన్నా పిల్లలు మాస్క్ వేసుకొని, సమాజం ముందు తల్లిదండ్రులకు నచ్చినట్టుగా వ్యవహరించడం మొదలు పెట్టి మెల్లగా ఆ పరిధిలోనే ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఆనందాన్ని ముఖానికి పులుముకుంటే నష్టమేమీ లేదు కదా అని వీరి వాదన. అయితే ఈ ‘మాస్కింగ్’ అలవాటైతే కొంతకాలానికి మనిషి రెండు రకాల జీవితాలను జీవించాల్సి వస్తుందని సైకియాట్రిస్టులు అంటున్నారు. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియనంతగా వారు ‘మాస్కింగ్’కు అలవాటు పడతారని, ఇది దీర్ఘకాలిక మానసిక సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.
ముసుగు వెయ్యకుండా బతికితే...
ఎవరిని వారు ప్రేమించుకొని, గౌరవించుకుంటే ఈ మాస్కింగ్ అవసరమే లేదని నిపుణుల మాట. తమలో లేని గుణాల గురించి ఆలోచించడం మానేసి, ఉన్న గుణాల్లో మంచివాటిని మరింత మెరుగుపరుచుకోవడం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం చేస్తే ముసుగులు వేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే నేర్పాలని అంటున్నారు. సమాజాన్నో, మరెవరినో ఇంప్రెస్ చేసేందుకు ముసుగులు వేసుకోవడం మొదలుపెడితే చివరకు మన అసలు ముఖం మరుగునపడి, కనిపించకుండా పోతుందని అంటున్నారు.


