మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు యత్నించే పోలీసులకు ప్రత్యేక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న ఎవరికైనా మొదట గుర్తొచ్చేది పోలీసులు. విపత్తులైనా, శాంతిభద్రతల సమస్యలైనా వెంటనే డయల్ 100కి కాల్ చేస్తాం. అదే పోలీసులకు ఆపదొస్తే..? అనుకోని కష్టాలతో ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకునేంతగా కుంగిపోతే? అలాంటి వారికి ‘మిత్ర’అనే శిక్షణ కార్యక్రమం అండగా నిలుస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యపానం, విపరీతంగా అప్పులు చేయడం వంటి కారణాలతో దారితప్పుతున్న సిబ్బందిని గాడిలో పెట్టి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేందుకు పోలీస్ మిత్ర బృందాలు కృషిచేస్తున్నాయి.
నిత్యం సవాళ్లతో కూడిన విధుల్లో ఉండే పోలీసుల మానసిక, శారీరక ఆరోగ్యం కాపాడే లక్ష్యంతో స్వాతిలక్రా బెటాలియన్స్ అడిషనల్ డీజీగా ఉన్న సమయంలో టీజీఎస్పీలో ‘మిత్ర’ను 2023లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో ఉత్తమ ఫలితాలు వస్తుండటంతో ప్రస్తుత అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ ఇందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కోసం నిర్వహించిన ‘లవ్ యూ జిందగీ’ కార్యక్రమం దీనికి స్ఫూర్తి అని అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఇతర విభాగాలకూ దీన్ని విస్తరించే అవకాశం ఉంది.
8 రోజులు తరగతులు
టీజీఎస్పీలోని 13 బెటాలియన్స్ నుంచి ఎంపిక చేసిన 68 మంది మాస్టర్ ట్రైనర్ సర్టీఫికేషన్ కోర్సు పూర్తి చేశారు. వీరంతా ప్రతి బెటాలియన్‌లో ఐదుగురు చొప్పున ‘మిత్ర’శిక్షకులుగా పనిచేస్తున్నారు. ఫిర్యాదులొచ్చిన వారితోపాటు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి 20–30 మంది చొప్పన బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. మూడేళ్లలో 9,153 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో ఎంతోమంది తమను తాము మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ‘8 రోజుల కోర్సులో మానసిక ఆరోగ్యం, అవగాహన పెంచడం, కుటుంబ, ఆర్థిక అంశాల నిర్వహణ, లింగ సమానత్వం అనే అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతాం. వారి ఇబ్బందులు తెలుసుకుని వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం’అని ట్రైనింగ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎన్‌వీ రమణ తెలిపారు.
సిబ్బందిలో మార్పు తెస్తోంది: సంజయ్ కుమార్ జైన్, అడిషనల్ డీజీ, టీజీఎస్పీ పోలీస్ ఉద్యోగంలో ఒత్తిడి తప్పదు. మానసిక, శారీరక ఒత్తిడిని ఎలా జయించాలన్న అంశాలపై బెటాలియన్స్ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. మిత్ర శిక్షణతో సిబ్బందిలో మార్పు కనిపిస్తోంది. ఈ కోర్సును మరింత ప్రభావంతంగా మార్చేందుకు కొత్త అంశాలను జోడించి మార్పులు చేస్తాం.
ముందు ఎంతో కోపం ఉండేది: కానిస్టేబుల్, 8వ బెటాలియన్
నాకు గతంలో ఎంతో కోపం ఉండేది. ఏ చిన్న విషయమైనా గొడవ పెట్టుకునే వాడిని. అలా ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ, మిత్ర కోర్సు తర్వాత నాలో మార్పు వచ్చింది. ఏ పరిస్థితి అయినా వెంటనే రియాక్ట్ కాకుండా కాస్త స్థిమితంగా ఆలోచించాకే మాట్లాడుతున్నా. గతంలో విచ్చలవిడిగా క్రెడిట్‌కార్డు వాడేవాడిని. అప్పులు పెరిగేవి. ఇప్పుడు దుబారా ఖర్చులు తగ్గించుకున్నా.
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా..: కానిస్టేబుల్, 3 బెటాలియన్
గతంలో ఎంతో ఎమోషనల్‌గా ఉండేవాడిని. ఆర్థిక ఇబ్బందులతో ఒకసారి ఆత్మహత్యవరకు వెళ్లాను. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా.. ముందు కాస్త ఆలోచించాకే నిర్ణయాలు తీసుకుంటున్నా. ఇంట్లో కూడా ఎంతో కోపంగా ఉండేవాడిని. కుటుంబ విలువ తెలుసుకున్నా, బడ్జెట్ డైరీ పెట్టుకొని అనవసర ఖర్చులు తగ్గించడం నేర్చుకున్నా. వీటి గురించి నాతోటి సిబ్బందికీ చెబుతున్నా.
వ్యసనాలన్నీ వదిలేశాను..
నేను గతంలో మద్యంతోపాటు ఎన్నో చెడు అలవాట్లకు బానిసనయ్యాను. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నా. నా ప్రవర్తన చూసి ఉన్నతాధికారులు ఎన్నోసార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ నాలో మార్పు రాలేదు. కానీ మిత్ర శిక్షణకు వచ్చిన తర్వాత నన్ను నేను మార్చుకున్నా. చెడు అలవాట్లు పక్కన పెట్టా. నా గౌరవం కూడా పెరిగింది. – హెడ్‌కానిస్టేబుల్, 8వ బెటాలియన్


