శీతాకాలంలో నిస్తేజమైన చర్మంతో విసిగిపోయారా, మెరిసే చర్మం కావాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? కంగారు పడొద్దు. సమతుల్య ఆహారంతోపాటు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మన ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే బెర్రీలు, బచ్చలికూర, గింజలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు చర్మాన్ని రక్షిస్తాయి.
హైడ్రేట్గా ఉంటూ, సరైన పోషక విలువలు తీసుకుంటూ, సంరక్షణ చర్యలుతీసుకుంటే మొహంతోపాటు, చర్మం కూడా నిగనిగ లాడుతూ కాంతివంతంగా ఉంటుంది. వీటితోపాటు చర్మానికి సహజమైన మెరుపు కావాలంటే ఇవిగో చిట్కాలు.
డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోయి చర్మం డల్‌గా, పొడిగా, నిస్తేజంగా అయిపోతుంది. వాయు కాలుష్యం, సూర్యరశ్మితో సహా పర్యావరణ కాలుష్యం కారణంగా చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా మారవచ్చు. అందుకే సమతుల ఆహారంతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. అప్పుడే స్కిన్ ప్రకాశవంతంగా, సహజమైన మెరుపుతో ఆకర్షణీయంగా ఉంటుంది.
మృత చర్మ కణాలు తొలగించేందుకు, రంధ్రాలు అన్ లాగ్ చేసేందుకు చర్మాన్ని క్రమం తప్పకుండా ఎక్స్ ఫోలియేట్ చేయాలి. రసాయన రహిత చర్మ సంరక్షణ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటి చర్మ సంరక్షణను పాటించాలి. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ రకానికి తగిన ఉత్పత్తులు ఉపయోగించాలి.
శీతాకాలంలో నువ్వుల నూనెతో మాసాజ్ చేసుకొని కాస్తంత ఎండ తగలనిచ్చి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మానికి చాలా ఉపశమనంగా ఉంటుంది. చక్కటి రక్త ప్రసరణ కూడా జరిగి స్మూత్‌గా, షైనీగా స్కిన్ మెరుస్తుంది.
స్కిన్ బ్రైటెనింగ్ , మాయిశ్చరైజింగ్ కోసం ఫ్యాన్సీ విటమిన్ సి ఫేస్ క్రీమ్ వాడవచ్చు. చర్మ తత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి.
పైనాపిల్ రసాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల చర్మం కొత్తకాంతితో మెరుస్తుంది.
చిన్న సైజు బంగాళ దుంప, రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సాస్ కలిపి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం సహజ కాంతితో మెరుస్తుంది.
గుడ్డు సొన, ఆలివ్ ఆయిల్, కీర గుజ్జు సమభాగంలో తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. జుట్టుకు పట్టులాంటి మృదుత్వం లభిస్తుంది. కేశాల ఎదుగుదలకూడా మెరుగవుతుంది.
ఒత్తిడిలేని జీవితాన్ని గడపాలి. రోజుకు కనీసం 7 గంటలు నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి. ఆరుబయట సమయం గడపడం, వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యంతోపాటు, చర్మంకూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు ఆరోగ్యానికి బాటలు వేస్తుంది.


