నలుగురిని తమ కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద బాంబుపేలుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను మరింత వేగవంతంచేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులు కస్టడీలో ఉన్న నిందితులు డాక్టర్ ముజామిల్ ఘనీ, అదీల్ రాఠర్, వైద్యురాలు షాహీనా సయీద్, మత బోధకుడు ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్‌లను ఎన్‌ఐఏ గురువారం తమ కస్టడీలోకి తీసుకుంది. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
ఫరీదాబాద్ ఉగ్రమాడ్యూల్ సభ్యులు ఎలా అఫ్గాన్, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, తుర్కియేలోని హ్యాండ్లర్లతో సత్సంబంధాలు పెట్టుకున్నారు? నిధులు ఏఏ మార్గాల్లో సంపాదించారు? విధ్వంసకర రచన చేసిందెవరు? వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రమాడ్యూల్‌లో వాస్తవంగా ఎంత మంది సభ్యులు ఉన్నారు? అంటూ ప్రశ్నలవర్షం కురిపించి వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ‘‘ ఈ నలుగురు మొత్తం ఉగ్రమాడ్యూల్‌లో అత్యంత కీలకమైన సభ్యులు. వీళ్ల వద్ద చాలా సమాచారం ఉంటుంది’’ అని జాతీయ దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఢిల్లీ పోలీసుల నుంచి నవంబర్ 11న అధికారికంగా కేసు తమ చెంతకు వచ్చాక ఎన్‌ఐఏ అమీర్ రషీద్ అలీ, జసీర్ బిలాల్ వానీ అలియాస్ డ్యానిష్‌లను అరెస్ట్‌చేసింది. గురువారం ఈ నలుగురిని తమ అదుపులోకి తీసుకోవడంతో ఎన్‌ఐఏ అరెస్ట్‌ల సంఖ్య ఆరుకు పెరిగింది. గురువారం ముజామిల్, అదీల్, షాహీనా, ఇర్ఫాన్ వగాయ్‌లను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుల ప్రాంగణంలోని కోర్టులో ఎన్‌ఐఏ ప్రవేశపెట్టింది. కేసు దర్యాప్తు నిమిత్తం వీళ్లందర్నీ తమకు అప్పగించాలని కోర్టును కోరగా 10 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి అంజూ బజాజ్ ఛాంద్నా ఉత్తర్వులు జారీచేశారు.


