సాక్షి హైదరాబాద్: మియాపూర్ పోలీసులు శబాష్ అనిపించుకున్నారు. డయల్ 100కు కాల్ చేసిన క్షణాల్లోనే స్పందించి ఏటీఎంలో దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని సత్తా చాటుకున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యతని దానికోసం నిరంతరం అప్రమత్తతతో ఉంటామని పోలీసులు తెలిపారు.
పోలీసులు వివరాల ప్రకారం.. మాదాపూర్ జోన్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్, మార్థండనగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద నిన్న(ఆదివారం) రాత్రి సమయంలో దొంగతనం జరుగుతోందని గుర్తుతెలియని వ్యక్తులు 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఏటీఏంలో డబ్బుల చోరీకి యత్నిస్తున్న నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనంతపురం జిల్లా అక్కంపల్లి మండలం జార్జ్‌పేట్ గ్రామం వాసి కాటమయ్య (24)గా గుర్తించినట్లు తెలిపారు
ఏటీఏం చోరికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్దనష్టం తప్పినట్లు మియాపూర్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. చుట్టు ప్రక్కల ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు నమోదైతే ప్రజలు డయల్–100కు కాల్ చేయాలని ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు.


