అమెరికా కోర్టులో మదురో వాదన
ప్రధమ పౌరురాలినన్న సిలియా ఫ్లోరెస్
తదుపరి విచారణ మార్చికి వాయిదా
న్యూయార్క్: వెనెజువెలా పదవీచ్యుత అధ్యక్షుడు నికొలస్ మదురో అమెరికా గడ్డపై బందీగా ఉన్నా ఏమాత్రం జంక లేదు. ‘నేను వెనెజువెలా అధ్యక్షుడిని. కారకాస్‌లోని నా ఇంట్లో ఉండగా బంధించి తీసుకువచ్చారు. నేనెలాంటి తప్పూ చేయలేదు. అమాయకుడిని. మర్యాదస్తుడిని’ అని సోమవారం మన్‌హట్టన్ కోర్టులో చెప్పుకున్నారు. వ్యాపార లావాదేవీలను తప్పుగా చూపారంటూ నమోదైన కేసులో 2024లో డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే కోర్టు బోనులో నిలుచోవడం విశేషం.
మదురో కేసులో క్లింటన్ హయాంలో నియమితులైన 92 ఏళ్ల అల్విన్ హెల్లెర్‌స్టీన్ వాదనలు విన్నారు. సరిగ్గా 12 గంటల సమయంలో కాళ్లకు మాత్రమే గొలుసులుండగా చేతులు వెనక్కి పెట్టుకుని భద్రతా సిబ్బంది వెంటరాగా మదురో కోర్టు హాల్లోకి ప్రవేశించారు.ౖ మదురో, సిలియాలు హెడ్‌ఫోన్లు పెట్టుకుని ఇంగ్లిష్ నుంచి స్పానిష్‌లోకి కోర్టు ప్రొసీడింగ్ అనువాదాలను వింటూ ఉన్నారు.
జడ్జి అల్విన్ హెల్లెర్‌స్టీన్ పరిచయం అనంతరం మదురో.. వెనెజువెలా అధ్యక్షుడినంటూ జడ్జికి స్పానిష్ భాషలో పరిచయం చేసుకున్నారు. తానెలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తనను బందీగా మార్చారంటూ స్పానిష్‌లో మదురో చెప్పారు. ఆయన మాటలను కోర్టు రూం రిపోర్టర్ అనువాదం చేసి జడ్జికి తెలిపారు.
మదురో భార్య సిలియా ఫ్లోరెస్ కూడా తాను వెనెజువెలా ప్రథమ మహిళనంటూ చెప్పుకున్నారు. ఎలాంటి తప్పూ చేయలేదని స్పానిష్‌లో తెలిపారు. వీరిద్దరూ జైలు నుంచి విడుదలను గానీ, బెయిల్‌ను గానీ కోరడం లేదని లాయర్లు తెలిపారు. జడ్జి ఆదేశాల మేరకు అభియోగాలకు సంబంధించిన పత్రాలను అధికారులు ఇద్దరికీ అందించారు. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17న ఉదయం 11 గంటలకు ఉంటుందని జడ్జి ప్రకటించారు.
మదురోపై విచారణ చేపట్టిన కోర్టు సముదాయం వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. మదురోను విడుదల చేయాలని కొందరు, ట్రంప్ కింగ్.. అంటూ మరికొందరు నినాదాలు చేశారు. అంతకుముందు, బ్రూక్లిన్ జైలు నుంచి సోమవారం ఉదయం 7.15 గంటల సమయంలో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను జైలు నుంచి అత్యంత భారీ భద్రతతో కూడిన వాహన శ్రేణిలో దగ్గర్లోని అథ్లెటిక్ ఫీల్డ్‌కు తీసుకెళ్లారు. హెలికాప్టర్ లోకి వారిని ఎక్కించారు.
ఆ హెలికాప్టర్ మన్‌హ ట్టన్ హెలిపోర్టులో ల్యాండయ్యింది. హెలికాప్టర్ నుంచి దించి సాయుధ వాహనంలో వారిని కూర్చో బెట్టుకుని కోర్టుహౌస్ కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లారు. శనివారం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో కారకాస్ లోని మిలటరీ బేస్‌లోని నివాసం నుంచి మదురో, సిలియాలను అమెరికా బలగాలు న్యూయార్క్‌కు తీసుకురావడం తెల్సిందే. మాదక ద్రవ్యాలతో పాటు ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలను వారిద్దరిపైనా మోపారు. కాగా, మదురో భార్య సిలియా డ్రగ్స్ అక్రమ రవాణాదారుల నుంచి 2007లో భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఎవరీ పొలాక్..?
మదురో తరఫున వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ లాయర్ బ్యారీ పొలాక్ వాదనలు వినిపించారు. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే తరఫున దీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించింది ఈయనే. అమెరికా గూఢచర్య చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను జైలు నుంచి విడుదల చేయించి, సొంతదేశం ఆస్ట్రేలియాకు పంపించడంలో కీలకంగా ఉన్నారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరని ఈయనకు పేరుంది.


