బెంగాల్ రాజకీయంలో కలకలం రేపుతున్న వీడియో
కోల్‌కతా: ఓ టేబుల్‌పై నోట్ల కట్టల గుట్ట..ఆ వెనుక టీఎంసీ నేత ఒకరు కూర్చున్న వీడియో ఒకటి పశ్చిమబెంగాల్‌లో వైరల్‌గా మారింది. ఉత్తర 24 పరగణాల జిల్లా బరాసత్–1 పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడు మహ్మద్ గియాసుద్దీన్ మండల్, స్థానిక వ్యాపారి రకీబుల్ ఇస్లాంతోపాటు కూర్చుని ఉండగా వారికి ఎదురుగా ఉన్న టేబుల్‌పై పెద్ద మొత్తంలో డబ్బు కట్టలు కనిపిస్తున్నాయి.
ఫోన్‌లో అవతలి వ్యక్తి.. ‘కొనేది క్యాష్‌లోనా, ఫైనాన్స్‌లోనా అని అడుగుతుండగా, అప్పుడే మరోవ్యక్తి నోట్ల కట్టలు నింపి ఉన్న నైలాన్ బ్యాగ్‌తో ఆ గదిలోకి ప్రవేశించడం కనిపిస్తోంది. మరికొద్ది నెలల్లోనే రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వెలుగు చూసిన ఈ వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. టీఎంసీ అక్రమ లావాదేవీలకు ఇదే నిదర్శనమంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఇది 2022 నాటి పాత వీడియో అని మండల్ కొట్టిపారేస్తున్నారు.
అది ఓ భూమి లావాదేవీకి సంబంధించిన అంశమని, తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. వీడియో కనిపిస్తున్న నగదు రెండేళ్ల క్రితం జరిగిన భూ లావాదేవీకి సంబంధించిందని రకీబుల్ ఇస్లాం కూడా తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పిదం లేదని చెప్పారు. ఆ భూమి వ్యవహారంలో మండల్ భాగస్వామిగా ఉన్నారని, వీడియోలో కనిపించేది తన ఆఫీసు కూడా కాదని రకీబుల్ అన్నారు.
ఈ అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని బరాసత్–1 పంచాయతీ టీఎంసీ కన్వీనర్ మహ్మద్ ఇషా సర్కార్ చెప్పారు. వీడియోలో పెద్ద ఎత్తున కనిపిస్తున్న నగదుపై అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అది అసలైన వీడియోనా కాదా అనేది తేలుస్తామన్నారు. వీడియోపై బీజేపీ నేత తపస్ మిత్రా మాట్లాడుతూ.. స్థానిక భూ మాఫియా వెనుక మహ్మద్ గియాసుద్దీన్ మండల్ హస్తముందని ఆరోపించారు. ఈ వీడియోను చూస్తే అధికార టీఎంసీ అసలు స్వరూపం తేటతెల్లమవుతుందని విమర్శించారు.


