అమెరికాలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయ్యింది. ఐసిస్‌తో సంబంధాలున్న ఓ టీనేజర్‌ను ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా దాడులకు అతను ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థ చీఫ్ కాష్ పటేల్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా యువత ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా సారిస్తామని ప్రకటించారాయన.
పక్కా సమాచారంతో నార్త్ కరోలినాలోని షార్లెట్ సమీపంలో మింట్ హిల్ ప్రాంతానికి చెందిన ఓ టీనేజర్‌ను ఎఫ్‌ఐబీ అదుపులోకి తీసుకుంది. అతని నుంచి దాడికి సంబంధించిన ప్రణాళికను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా రద్దీగా ఉండే ఓ గ్రాసరీ స్టోర్, మరో ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో మారణహోమం జరపాలని చూశాడని కాష్ పటేల్ మీడియాకు వెల్లడించారు.
ఐసిస్ లింకులు
ఎఫ్‌బీఐ అదుపులో ఉన్న టీనేజర్ పేరు క్రిస్టియన్ స్టర్డివాంట్. వయసు 18 ఏళ్లు. ఐసిస్ ప్రేరణతోనే అతను దాడులు చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా విదేశీ ఉగ్రసంస్థ అతనికి బ్రెయిన్‌వాష్ చేసిందని ఎఫ్‌బీఐ ప్రకటించింది. ‘‘మూడేళ్లుగా అతనిపై నిఘా ఉంచాం. యూరప్‌లోని ఓ ఐసిస్ సభ్యుడితో కాంటాక్ట్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి అతనికి ఆన్‌లైన్‌లో ఆదేశాలు అందేవి. నల్ల దుస్తుల్లో దాడులకు పాల్పడాలని అతనికి సమాచారం అందింది. తనను తాను ఐసిస్ సైనికుడిగా ప్రకటించుకుని.. దాడికి సిద్ధమంటూ అవతలి వాళ్లకు డిసెంబర్ 12వ తేదీన ఓ సందేశం పంపాడు. ఈ దాడికి తాను పని చేసే చోట్లనే ఎంచుకున్నాడు. ముస్లింయేతర గ్రూపులు, ఎల్జీబీటీక్యూలను, యూదులు, క్రిస్టియన్‌లపై దాడుల చేయాలని తన బుక్‌లో రాసుకున్నాడు. ఐసిస్‌కు సంబంధించి టిక్‌టాక్ వీడియోలను ఇతను ప్రొత్సహించాడు. అతని మానసిక స్థితి కూడా బాగోలేదు. గతంలో చికిత్స తీసుకున్నట్లు ఆధారలు లభించాయి’’ అని అధికారులు తెలిపారు.
అయితే తుపాకులు, బాంబులతో కాకుండా కత్తులు, హ్యమర్లతో దాడికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయుధాల్ని ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది. మరోవైపు.. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ (US Justice Department) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా యువతలో ఈ తరహా సంబంధాలపై నిఘా, దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఆ పేపర్‌పై..
మింట్‌హిల్‌లోని క్రిస్టియన్ ఇంటిని తనిఖీలు నిర్వహించినప్పుడు “New Years Attack 2026” అనే టైటిల్‌తో ఉన్న ఒక బుక్‌ను గమనించారు. అందులో దాడి ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలి.. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి అనే వివరాలు ఉన్నట్లు ఎఫ్‌ఐబీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన అతనిపై క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసి.. నిన్న కోర్టులో హాజరు పరిచారు. నార్త్ కరోలినా వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ యుఎస్ అటార్నీ రస్ ఫెర్గుసన్ ‘‘క్రిస్టియన్ స్టిర్టివాంట్ జిహాద్‌కు సిద్ధమయ్యాడు. కాస్తుంటే అమాయకులు ప్రాణాలు పోయేవే’’ అని వ్యాఖ్యానించారు. స్టర్డివాంట్ తనపై ఆరోపణలకు ఇంకా నోరు విప్పలేదు. ప్రస్తుతం కస్టడీలోనే ఉన్న అతన్ని.. వచ్చే వారం ఎఫ్‌బీఐ కోర్టులో హాజరు పర్చనుంది.


