శీతల గాలులు,  పొగ మంచు  | North India reels under cold wave, dense fog says IMD | Sakshi
Sakshi News home page

శీతల గాలులు,  పొగ మంచు 

Jan 6 2026 6:13 AM | Updated on Jan 6 2026 6:13 AM

North India reels under cold wave, dense fog says IMD

వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాలు 

మరో వారం ఇదే పరిస్థితులు  

అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

సాక్షి, న్యూఢిల్లీ: శీతల గాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తరాది రాష్ట్రాలు చలితో వణుకిపోత్నునాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. రానున్న ఏడు రోజులపాటు చలి, పొగమంచు కొనసాగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మంచు కురిసే అవకాశం సైతం ఉందని సోమవారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. 

పలుచోట్ల దృశ్యమానత (విజిబిలిటీ)తీవ్రంగా పడిపోయిందని.. వచ్చే వారం కూడా ఇదే పరిస్థితులుంటాయని స్పష్టం చేసింది. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌లలో ఈ నెల 8వ తేదీ వరకు, పశ్చిమ రాజస్థాన్‌లో 9వ తేదీ వరకు, తూర్పు రాజస్థాన్‌లో 10వ తేదీవరకు, జార్ఖండ్‌లో 7వ తేదీ వరకుశీతల గాలుల తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. ఉత్తర, మధ్య కశీ్మర్‌లోని పర్వత ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం, మంచు పడవచ్చని అంచనా వేసింది. 

మధ్య, తూర్పు భారతంలో రానున్న మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశముందని స్పష్టం చేసింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సోమవారం వాతావరణం సాధారణంగా నే ఉన్నప్పటికీ.. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో శీతల గాలుల ప్రభావం కనిపించవచ్చని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, వారణాసి, మీరట్, నోయిడా వంటి చోట్ల వాయువ్య దిశ నుంచి వీచే గాలుల కారణంగా చలి మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని కోరింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement