ప్లీజ్ హెల్ప్ మీ నాన్న… నాకు చావాలని లేదు. నేను నీటితో నిండిన లోయలో పడిపోయాను. నీటిలో మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు, నాన్న…”
ఈ మాటలు ఆ తండ్రి గుండెను ముక్కలు చేశాయి.
ఒక యువకుడి కలలు, ఆశలు, భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోయాయి.
మంచు కమ్ముకున్న రాత్రి, రక్షణా చర్యలు లేని రహదారి, ఊహించని లోయ. ఈ మూడు కలిసి ఓ టెక్కీ జీవితాన్ని క్షణాల్లో ముగించాయి.
ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన యువరాజ్ మొహతా (27) ఐటీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం విధులు ముగించుకుని కారులో తన ఇంటికి బయలు దేరాడు. సరిగ్గా నోయిడా సెక్టార్ 150 వద్ద మంచు విపరీతంగా కురుస్తోంది. ఎటు వెళ్తున్నామో తెలియదు. ప్రమాదం అని తెలిపే సంకేతాలు లేవు. రిటైనింగ్ వాల్ లేదు. సైన్ బోర్డులు లేవు. బారికేడ్లు లేవు. ఇతర రక్షణా చర్యలు లేవు. రిఫ్లక‌్షన్స్ లేవు. అయినా సరే ఇంటికి సురక్షితంగా వెళ్తున్నామనే ధీమా. సరిగ్గా అలాంటి సమయంలో ఊహించని విధంగా మృత్యువు ముంచుకొచ్చింది.
ఫలితంగా 70 అడుగుల లోతులో యువరాజ్ కారు పడిపోయింది. ఎదో ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నానని అర్ధం చేసుకున్న యువరాజు.. ప్లీజ్ హెల్ప్ మీ.. ప్లీజ్ సేవ్ మీ అని కేకలు వేశాడు. లాభం లేకపోయింది. అసలే చిమ్మ చీకటి. ఏం జరిగిందే అర్ధం కాని పరిస్థితి. వెంటనే ఆ టెకీ తన తండ్రి రాజ్‌కుమార్ మెహతాకు ఫోన్ చేశాడు. ‘నాన్న, నేను నీటితో నిండిన లోతైన గుంతలో పడిపోయాను. నేను మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు’అని ఆందోళన వ్యక్తం చేశాడు.
కొడుకు ఫోన్ కాల్‌తో హతాశుడైన రాజ్ కుమార్ మెహతా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు,ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాజ్ కుమార్ సైతం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాడు. సుమారు ఐదుగంటల పాటు శ్రమించి 70 అడుగుల లోతులో పడిన కారును అందులో చిక్కుకున్న యువరాజ్‌ను వెలికి తీశారు.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ఊపిరాడక యువరాజ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కుమారుడి మరణంపై రాజ్‌కుమార్ మెహతా ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. ఎలాంటి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు లేనందు వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతనికి మద్దతుగా స్థానికులు సైతం ఆందోళన చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న నోయిడా సెక్టార్ 150 వద్ద వార్నింగ్ బోర్డుల పెట్టాలని,రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆందోళన మరింత ఉదృతం చేశారు. దీంతో పోలీసులు ఈ దుర్ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యల తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.


