పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటన లాహోర్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోధా జిల్లాలోని కోట్ మోమిన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ప్రమాదానికి గురైన ట్రక్కులో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు తెలిపారు. వీరంతా ఫైసలాబాద్‌లో జరిగే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారి మూసివేయడంతో డ్రైవర్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే తక్కువ దృశ్యమానత కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోయి గాలాపూర్ వంతెన నుంచి నీరు లేని కాలువలోకి ట్రక్కు పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కోట్ మోమిన్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బలూచిస్థాన్‌లో బస్సు బోల్తా: 10 మంది మృతి
ఇదే రోజు బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ సమీపంలోని మక్రాన్ తీరప్రాంత రహదారిపై ప్రయాణికుల బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు సంభవిస్తున్న వరుస ప్రమాదాలు పాకిస్తాన్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.


