విమానాశ్రయం(గన్నవరం): కొన్నిరోజులుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) పరిసరాల్లో కురుస్తున్న పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సోమవారం కూడా రెండు విమాన సర్విస్‌లు రద్దుకాగా, మరో నాలుగు ఆలస్యంగా నడిచాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు విమానాశ్రయ ప్రాంతాన్ని కప్పివేసింది. దీంతో న్యూఢిల్లీ నుంచి ఉదయం 9.30 గంటలకు వచ్చిన ఎయిరిండియా విమానం రన్‌వే విజిబులిటీ లేకపోవడంతో సుమారు అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది.
అనంతరం రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఉదయం విశాఖపట్నం–విజయవాడ మధ్య తిరిగే రెండు విమాన సర్విస్‌లను రద్దు చేశారు. చెన్నై నుంచి ఉదయం 7.10కు రావాల్సిన విమానం 11.20కు, హైదరాబాద్ నుంచి ఉదయం 7.10కు రావాల్సిన విమానం 10.52, బెంగళూరు నుంచి ఉదయం 9గంటలకు రావాల్సిన విమానం 10.58 గంటలకు వచ్చాయి. న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగమంచు ప్రభావం తగ్గే వరకు విమానాల రాకపోకల్లో అంతరాయం కొనసాగుతుందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.


