గజిబిజి అక్షరాలతో మందుల చీటి
డాక్టర్ మెడికల్ షాప్‌కు తప్ప వేరే వారికి అర్థం కాని వైనం
మందులు ఎలా వాడాలో స్పష్టంగా రాయని కొందరు డాక్టర్లు
బీడీ, ఓడీ, టీఐడీ అంటూ సామాన్యులకు అర్థం కాని గీతలు
మెడికల్ షాపు వారు వివరించకపోతే అంతే!
ఎన్‌ఎంసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పినా వినని వైనం
పాఠశాలలో అక్షరాలు గుండ్రంగా రాయకపోతే బాలలను ఉపాధ్యాయులు మందలించేవారు. అక్షరాలు ఆణిముత్యాల్లా ఉండేందుకు పలుసార్లు రాయించేవారు. పరీక్షల్లో అందమైన దస్తూరితో మంచి మార్కులు వచ్చి కొందరు వైద్యులై అర్థంకాని రీతిలో మందుల చీటిని రాస్తున్నారు. సంతకం వద్ద సిగ్నేచర్ పెట్టినట్లు మందులు రాసి ఇస్తున్నారు. ఇలా రాసిన చీటి పట్టుకుని ఎక్కడికి వెళ్లినా మందులు దొరకని పరిస్థితి. భూమి గుండ్రంగా ఉందన్నట్లు ఆ మందులు రాసిన డాక్టర్ ఉన్న మెడికల్‌షాపునకు వెళితే తప్ప మందులు లభించని పరిస్థితి. ఇటీవల కొంత మంది వైద్యులకు ఈ జాడ్యం పట్టుకుంది. – కర్నూలు(హాస్పిటల్)
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 200లకు పైగా ప్రైవేటు ఆసుపత్రులు, వెయ్యికి పైగా క్లినిక్‌లు పనిచేస్తున్నాయి. ఆయా ఆసుపత్రులోని వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు అర్థమయ్యేరీతిలో మందుల చీటిని రాసివ్వాలి. ఆ మందుల చీటి పట్టుకుని ఏ మెడికల్‌షాపునకు వెళ్లినా వారు అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా మందులు ఇచ్చేలా ఉండాలి.
కానీ కొందరు వైద్యులు గజిబిజి రాతతో రోగులను తికమకపెడుతున్నారు. మందులను స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా, పెద్ద అక్షరాలతో రాయాలని ఉన్నా పలువురు వైద్యులు ఆచరించడం లేదు. వారు రాసిన మందులు అటాచ్డ్ కౌంటర్(డాక్టర్ క్లినిక్‌లో ఉండే మెడికల్‌షాప్)లో మాత్రమే అర్హమయ్యేలా మందులు రాస్తున్నారు. అక్కడ తప్ప ఆ చీటి తీసుకుని దేశమంతా తిరిగినా మందులు లభించని విధంగా ఉంటున్నాయి. ఒక్కసారి ఆ వైద్యుని వద్దకు వెళ్లిన రోగి మళ్లీ అదే డాక్టర్ వద్దకు వెళ్లి, అక్కడి మెడికల్‌షాపులోనే మందులు తీసుకునేలా వైద్యంతో వ్యాపారం చేస్తున్నారు.
జాతీయ వైద్య కౌన్సిల్ చెప్పినా!
మందుల వివరాలను వైద్యులు స్పష్టంగా రాయాల్సిందేనని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వైద్య విద్య సంచాలకులతో పాటు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపల్‌లు, డైరెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి బోధనాసుపత్రిలో తప్పనిసరిగా ‘డ్రగ్స్ థెరప్యూటిక్స్ కమిటి(డీటీసీ) ఏర్పాటు చేసి తాము జారీ చేసిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అందులో సూచించింది.
వైద్యులు స్పష్టమైన చేతి రాతతో చీటిపై మందులు రాయాలని, ఈ మేరకు గత యేడాది ఆగషు్టలో పంజాబ్, హరియాణా హైకోర్టు తీర్పునిచ్చిన అంశాన్ని గుర్తు చేసింది. మందుల చీటిపై స్పష్టమైన రాత అన్నది రాజ్యాంగంలో ఆర్టికల్ 21కి లోబడి ఆరోగ్యహక్కు(రైట్ టు హెల్త్)కిందకు వస్తుందని ఈ కోర్టు పేర్కొందని వివరించింది. ఎన్‌ఎంసీ, ఎంసీఐలు వైద్యుల చేతి రాత గురించి పదే పదే ఆదేశించినా డాక్టర్లలో మార్పు రావడం లేదు. తమను ఎవరేమి చేస్తారులే అన్న చందంగా వారు నిర్భీతిగా వ్యవహరించడం గమనార్హం.
స్పష్టంగా రాయకపోతే ఇబ్బందులు
వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు చికిత్సకు సంబంధించిన మందులను ప్రిస్కిప్షన్‌లో స్పష్టంగా, పెద్ద అక్షరాలతో రాయకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. ఒకప్పుడు మందుల షాపులో మందులు కొన్న తర్వాత వాటిని తిరిగి తనకు చూపాలని డాక్టర్లు చెప్పేవారు. కానీ ఇప్పుడు చాలా మంది వైద్యులకు అంతటి ఓపిక లేదు. మెడికల్‌షాపులో చూపండి చెబుతారని పంపిస్తున్నారు. కానీ అర్థంగాని రీతిలో ఉన్న డాక్టర్ ప్రిస్కిప్షన్‌లో ఒక్కోసారి మెడికల్‌షాపు వారికే అర్థం గాక ఒక మందు బదులు, ఒక డోసు బదులు ఇంకో డోసు మందులు ఇచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి మందులు వేసుకోవడం వల్ల రోగికి దుష్ప్రభావాలు(సైడ్ ఎఫెక్ట్స్) ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. కాగా మరికొందరు వైద్యులు మందుల చీటిలో మందుల కింద ఏ మందు ఎన్ని పూటలు, ఎలా వాడాలో తెలుగులో స్పష్టంగా రాసేవారు. కానీ ఇప్పుడు బీడీ, ఓడీ, టీఐడీ అంటూ రాస్తున్నారు. వైద్యపరిభాషలో తెలిసిన వారికి మాత్రమే ఇలాంటి పదాలకు అర్థం తెలుస్తుంది. సామాన్య ప్రజలకు ఇవి అర్థం కావు. అలాగాకుండా వైద్యులే మందుల చీటిలో స్పష్టంగా ఏ మందు, ఎన్ని పూటలు వాడాలో అర్థమయ్యేలా రాస్తే ఇబ్బందులు ఉండవు.
వీరి రాత పక్కన మెడికల్‌షాపునకు ఎరుక
కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న పలువురు వైద్యుల ప్రిస్కిప్షన్ ఎవ్వరికీ అర్థం కాని రీతిలో ఉంటున్నాయి. ఓ కార్డియాలజిస్టు ప్రిస్కిప్షన్(prescriptions) చూస్తే ఈసీజీ గ్రాఫ్‌లా కనిపిస్తుంది. దానిని చూసి అర్థం చేసుకుని అక్కడే ఉన్న మెడికల్‌షాపు వారు మందులు తీసి ఇస్తారు. అక్కడ తప్ప ఆ మందులు బయట ఎక్కడా లభించవు. అలాగే గాయత్రి ఎస్టేట్‌లోని ఓ న్యూరోసర్జన్ సైతం ఇదే విధంగా మందులు రాస్తున్నారు. అక్కడే ఉన్న ఓ జనరల్ సర్జన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, లంగ్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, ఈఎన్‌టీ, గైనకాలజిస్టు, న్యూరాలజిస్టు, యురాలజిస్టు, కొత్త బస్టాండ్ ప్రాంతంలోని పలు ఆసుపత్రులు, ఎన్‌ఆర్ పేటలోని పలువురు వైద్యులు రాసే ప్రిస్కిప్షన్లు ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాయి. ఇటీవల బ్రాండెడ్ మందుల స్థానంలో స్థానికంగా తయారయ్యే మందులు అధికంగా వస్తున్నాయి. వాటిని రాస్తే అధికంగా లాభాలు వస్తాయన్న ఆశతో పలువురు వైద్యులు ప్రిస్కిప్షన్ రూపంలో ఇలా తప్పుడు గీతలు గీసి రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు ఇవీ
⇒ మందులను వాటి జనరిక్ పేర్లతో మాత్రమే రాయాలి. బ్రాండెడ్ పేర్లను నివారించాలి.
⇒ ప్రిస్కిప్షన్ల స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండాలి. వీలైతే పెద్ద అక్షరాలతో టైప్ చేసి ప్రింట్ చేయాలి. తద్వారా తప్పులు జరగకుండా ఉంటాయి.
⇒ మందులను తార్కికంగా, సరైన మోతాదులో, సరైన సమయంలో వాడేలా రాయాలి.
⇒ ప్రిస్కిప్షన్‌లో తేదీ, సమయం, ప్రదేశం, డాక్టర్ పేరు, హోదా, సంతకం, స్టాంప్ తప్పనిసరిగా ఉండాలి.
⇒ ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందులు విచక్షణతో ఉపయోగించాలి.
⇒ జనరిక్ మందుల లభ్యతను, వాటిని కొనుగోలు చేసే విధానాన్ని రోగులకు ప్రోత్సహించాలి.
⇒ ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులకు జనరిక్ మందుల విలువ గురించి శిక్షణ ఇవ్వాలి
జీజీహెచ్‌లో త్వరలో కమిటీ
వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు మందులను స్పష్టంగా, అందరికీ అర్థమయ్యే విధంగా రాయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఇటీవల అన్ని బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి త్వరలో డ్రగ్స్ థెరఫ్యూటిక్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నాం. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు
మందులు స్పష్టంగా రాయాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశాం. రోగులకు రాసే ప్రిస్కిప్షన్ పెద్ద అక్షరాలతో, అందరికీ అర్థమయ్యేలా ఉండాలని చెప్పాం. కానీ ఇప్పటికీ చాలా మంది వైద్యులు తమకు ఇష్టమొచ్చినట్లుగా అర్థంగానట్లు ప్రిస్కిప్షన్ రాస్తున్నారు. దీనివల్ల రోగులకు మందుల దుష్ప్రభావాలు ఎదురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. – డాక్టర్ ఎల్.భాస్కర్, డీఎంహెచ్‌ఓ, కర్నూలు
మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు
మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం రోగులకు వైద్యులు రాసే ప్రిస్కిప్షన్ పెద్ద అక్షరాలతో, జనరిక్ నేమ్‌తో రాయాలి. అది కూడా ఏ మందు, ఎప్పుడు, ఎలా వాడాలో కూడా స్థానిక భాషలో రాసి ఉండాలి. అలా గాకుండా ఇష్టమొచ్చినట్లు, ఎవ్వరికీ అర్థంగానట్లు రాస్తే అలాంటి వైద్యులపై మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
– డాక్టర్ ఎస్వీ రామమోహన్‌రెడ్డి, ఐఎంఏ కార్యదర్శి, కర్నూలు


