సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో పెద్దఎత్తున మావోయిస్టులు పట్టుబడిన వైనం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడ సమీపంలోని కానూరులో 28 మంది, ప్రసాదంపాడులో నలుగురితో కలిపి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 50 మంది మావోలు ఎలాంటి ప్రతిఘటన, ఎదురు కాల్పులు లేకుండా పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. పట్టుబడిన తీరు చూస్తే లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు వారిని అరెస్టు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పట్టుబడిన వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చారని పోలీసులు చెబుతున్నా.. అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారనేది చెప్పడంలేదు. మావోయిస్టులు వచ్చిన సమాచారం ముందే తెలుసని, అప్పటినుంచి వారిపై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినప్పుడు వారు ఎలా వచ్చారనే విషయం కూడా పోలీసులకు తెలియకుండా ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దేవ్‌జీ దొరకలేదట!
మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన 9 మంది మావోయిస్టులు పట్టుబడినట్టు ప్రకటించిన పోలీసులు.. దేవ్‌జీ ఏమయ్యారు, ఎక్కడున్నారనే ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. దేవ్‌జీ తమ అదుపులో మాత్రం లేరని చెబుతున్నారు. అయితే, దేవ్‌జీ పోలీసుల అదుపులోనే ఉన్నారని హక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు వచ్చినట్టు.. ఎలా పట్టుబడినట్టు?
మావోయిస్టు అగ్రనేత హిడ్మా భద్రతను పర్యవేక్షించే కీలక సభ్యురాలితో పాటు అదే విభాగానికి చెందిన 28 మంది సభ్యులు విజయవాడలో పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నారు. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు హతం కాగానే.. రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపి 50 మంది మావోయిస్టులను పట్టుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు వీరంతా ఎన్‌కౌంటర్‌కు ముందుగానే పోలీసులకు పట్టుబడ్డారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. వీరంతా బృందాలుగా విడిపోయి వేర్వేరు ప్రాంతాలకు ఎందుకు వచ్చారు? ఇంచుమించు అంతా ఒకే సమయంలో ఎలా పట్టుబడి ఉంటారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.


