సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా లొంగిపోయారు. దేవాతో పాటు తెలంగాణ కీలక నేత కంకణాల రాజిరెడ్డి కూడా పోలీసులు ఎదుట లొంగిపోయారు. మరో 48 మంది మావోయిస్టులు వీరి బృందంలో ఉన్నారు. తాజాగా మావోయిస్టుల లొంగుబాటు కారణంగా 41 మంది కేంద్ర కమిటీ సభ్యులతో ప్రారంభమైన మావోయిస్టు పార్టీ ఇప్పుడు నలుగురికి చేరింది.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక్క రాష్ట్ర కమిటీ సభ్యుడు మాత్రమే మిగిలారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సమకూర్చడంతో బర్సె దేవా కీలకంగా పనిచేశారు. మావోయిస్టు పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయి. వీరంతా అంతర్గత కలహాలకు తోడు ఆరోగ్య సమస్యలతో లొంగిపోయారు అని చెప్పుకొచ్చారు. ఈ లొంగుబాటుతో పీజీఎల్‌ఏ బెటాలియన్ మొత్తం కొలాప్స్ అయ్యింది. లొంగిపోయిన మావోయిస్టులకు నిబంధనల ప్రకారం రివార్డులు అందిస్తాం. తక్షణ సాయంగా రూ.25వేల చెక్కలను అందిస్తాం. ఉన్న 66 మందిలో లొంగిపోయిన వారు కాకుండా మిగిలిన వారంతా మరణించారు’ అని తెలిపారు.
కాగా, బర్సె దేవా మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో దేవా కీలకంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూస్తున్నారు. బర్సె దేవా లోంగిపోవడంతో ఇక కేంద్ర కమిటీలో కేవలం నాలుగు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇక, హిడ్మా, బర్సె దేవా ఛత్తీస్‌గఢ్‌లో ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించారు. నిన్న తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి బర్సె దేవా బృందాన్ని పోలీసులు తీసుకొచ్చారు.


