బర్సెదేవా, కంకణాల రాజిరెడ్డి, ఇతర మావోయిస్టుల వివరాలు తెలుపుతున్న డీజీపీ శివధర్‌రెడ్డి. చిత్రంలో పోలీసు ఉన్నతాధికారులు సుమతి, విజయ్‌కుమార్, మహేశ్ భగవత్, అనిల్‌కుమార్
గడువుకు ముందే లొంగిపోండి
మావోయిస్టులకు డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపు
మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా, రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి సహా 20 మంది లొంగుబాటు
రికార్డు స్థాయిలో 48 ఆయుధాలు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ‘సమయం మించిపోతోంది మిత్రమా..గడువులోగా వచ్చి లొంగిపోండి. ప్రభుత్వాలు, పోలీసుల తరఫున ఏ సహకారం అందాలో అది పూర్తిగా అందిస్తాం..’అని మావోయిస్టులకు డీజీపీ బి.శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్‌ఏ) పతనం అంచుకు చేరిందని, ప్రస్తుతం కేవలం 66 మంది మాత్రమే మిగిలారని తెలిపారు. ఇప్పటివరకు పట్టుబడిన మావోయిస్టుల నుంచి అత్యంత కీలక సమాచారం తెలిసిందని, వారు మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన 52 మంది అండర్ గ్రౌండ్‌లో ఉన్నట్టు రికార్డులు ఉన్నా..వాస్తవానికి 17 మంది మాత్రమే ఉన్నట్టు తెలిసిందని చెప్పారు.
మడావి హిడ్మా అనుచరుడు పీజీఎల్‌ఏ బెటాలియన్ కమాండర్ బడ్సె సుక్క అలియాస్ దేవా (బర్సె దేవా), దర్శన్, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్ రంకో సహా మొత్తం 20 మంది మావోయిస్టులు శనివారం డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. రెండు అత్యాధునిక లైట్ మెషీన్ గన్ (ఎల్‌ఎంజీ)లు సహా మొత్తం 48 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
రూ.20.3 లక్షల నగదు కూడా అప్పగించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్‌కుమార్, శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, ఆపరేషన్స్ అదనపు డీజీ అనిల్‌కుమార్, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి శివధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సహా మరే ఇతర రాష్ట్రాల పోలీస్ చరిత్రలోనూ ఒకే లొంగుబాటులో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు మావోయిస్టులు విడిచిపెట్టడం ఇదే మొదటిసారి (రికార్డు) అని తెలిపారు.
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ
‘అంతర్గత కలహాలు, ఆరోగ్య సమస్యలు, ప్రస్తుతం అడవుల్లో ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలకు మావోయిస్టులు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలి ఉన్న అగ్రనేతలు సహా అందరూ వీలైనంత త్వరలో జనజీవన స్రవంతిలోకి కలుస్తారని ఆశిస్తున్నాం. గెరిల్లా ఆపరేషన్లను ముందుండి నడిపిన దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ లొంగుబాటుతో ఆ పార్టీ రాష్ట్ర కమిటీపై పెద్ద దెబ్బ పడినట్లయింది.
రాజిరెడ్డి 1997లో ఉద్యమంలో చేరాడు. ప్రస్తుతం లొంగిపోయిన 20 మందికి మొత్తంగా రూ.1.81 కోట్ల రివార్డు అందిస్తాం. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున డీడీలు ఇస్తున్నాం..’అని డీజీపీ తెలిపారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. మారిన పరిస్థితులు, సాంకేతికత కారణంగా సాయుధ పోరాటం చేయడం కష్టమైందని చెప్పారు. అయితే తాను అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నట్టు తెలిపారు.
మిగిలిన వారు సైతం లొంగిపోవాలని సూచించారు. కాగా 2 ఎల్‌ఎంజీలతో పాటు అమెరికాలో తయారైన కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ దేశంలో తయారైన టవర్ రైఫిల్, 8 ఏకే 47లు, 10 ఇన్సాస్‌లు, 8 ఎస్‌ఎల్‌ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)లు, 4 బీజీఎల్ (బ్యారెల్ గ్రనేడ్ లాంచర్)లు, 11 సింగిల్ షాట్‌లు, రెండు గ్రనేడ్లు, ఒక ఎయిర్ గన్, 93 మ్యాగ్జైన్‌లు, 2,206 తూటాలు మావోయిస్టులు అప్పగించారు.


