రెండు ఘటనల్లో 14 మంది మావోయిస్టుల మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా , బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కుంట – కిష్టారం అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది చనిపోగా, బీజాపూర్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందనే పక్కా సమాచారంతో పాలోడి – పూటుక్ పల్లి అటవీ ప్రాంతంలో సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షణలో డీఆర్‌జీ బలగాలు గాలిస్తుండగా శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో పావలూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉదయం 8 గంటల వరకు భీకరంగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ఆ ప్రదేశం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను భద్రతా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. మరోవైపు బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్‌పల్లి – మూర్కపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. సుక్మా జిల్లా ఎన్‌కౌంటర్‌లో కుంట ఏరియా కార్యదర్శి సచిన్ మంగ్డూతో పాటు కమిటీ సభ్యులు మృతి చెందారని సమాచారం. గతంలో కుంట ఏఎస్పీ ఆకాశ్‌రావు గిరిపుంజేను హత్య చేసిన మావోయిస్టు కమాండర్లు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు తెలిసింది. ఇక బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో పామేడు ఏసీఎం మడకం హుంగా, ఏరియా కమిటీ సభ్యురాలు మడకం ముచ్చుకి మృతి చెందారు.


