కోరుట్లలోని తిప్పిరి తిరుపతి పాత ఇల్లు
పదో తరగతిలో ఉన్నప్పుడే రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితుడైన తిరుపతి
పోలీసు నిఘా పెరగడంతో అజ్ఞాతంలోకి..
ఉద్యమంలోనే సహచరితో పెళ్లి
కోరుట్ల: అణచివేతకు ఎదురొడ్డి.. భూస్వాముల దమనకాండను నిలదీసి.. అణగారిన వర్గాల్లో విప్లవ జ్వాలలు రగిలించిన తిప్పిరి తిరుపతి అలియాసదేవ్‌జీ రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడి నుంచి మావో అగ్రనేతగా ఎదిగారు. కోరుట్లలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తిరుపతి ఈ ప్రాంతంలో సామాన్య ప్రజానీకం భూస్వాముల అణచివేతపై చిన్నప్పటి నుంచే తిరుగుబావుటా ఎగురవేశారు. 1981లో పదో తరగతి నుంచే ఆయన రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితులయ్యారు. ఆర్‌ఎస్‌యూ క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు.
కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే సమయంలో విద్యార్థుల్లో విప్లవ భావాలను నూరిపోయడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు, దాడులు తీవ్రమయ్యాయి. పోలీసులు రాడికల్ విద్యార్థి సంఘం నాయకులపై నిఘా పెంచారు. ఇంటర్ పాసైన తిరుపతి 1983–84 సమయంలో కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో డిగ్రీలో చేరారు. అక్కడ ఆర్‌ఎస్‌యూ కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసుల నిఘా పెరగడంతో 1984 చివర్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
గిరాయిపల్లి ఒగ్గు కథ పాత్రధారి..
వరంగల్‌లోని నాటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ప్రస్తుత ఎన్‌ఐటీ)కి చెందిన నలుగురు విద్యార్థులు 1975లో సాయుధ రైతాంగ పోరాట నిర్మాణంలో పాలుపంచుకున్న క్రమంలో మెదక్ జిల్లా గిరాయిపల్లి వద్ద పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఈ ఘటనపై గద్దర్ రచించి పాడిన మల్లన్న, బీరప్ప, కొమురన్న ఒగ్గు కథ ప్రచారంలో తిరుపతి చురుకుగా పాల్గొన్నారు. 1982–83లో గిరాయిపల్లి ఒగ్గుకథను కోరుట్ల జూనియర్ కళాశాల మైదానంలో ప్రదర్శించగా ఒగ్గు కథలో బీరప్ప పాత్రను తిరుపతి పోషించారు. ఈ కథ వినేందుకు కోరుట్లవాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆ సమయంలో పల్లెల్లో విప్లవ భావాలను రగిలించడంలో గిరాయిపల్లి ఒగ్గు కథకు కీలకపాత్ర పోషించింది. ఈ సభ అనంతరం నుంచి తిరుపతిపై పోలీసుల నిర్భంధం పెరిగింది.
ఉద్యమ సహచరితో పెళ్లి..
డిగ్రీ చదువుతున్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన తిరుపతి కుటుంబంలో పెద్దవారు. తమ్ముడు వెంకటి చనిపోగా చిన్నతమ్ముడు గంగాధర్ కోరుట్లలోనే ఉన్నారు. ఆ సమయంలో కోరుట్ల అంబేడ్కర్‌నగర్‌లో చిన్నప్పుడే పెళ్లి చేసే సంప్రదాయం ఉండటంతో తిరుపతి తమ్ముళ్లకు చిన్ననాడే వివాహాలు అయ్యాయి. కానీ విప్లవబాట పట్టిన తిరుపతికి మాత్రం పెళ్లి కాలేదు. అజ్ఞాతంలోకి వెళ్లాక మహారాష్ట్రలో మావో ఉద్యమానికి ఊపిరిపోసే పనిలో నిమగ్నమైన క్రమంలో అదే ప్రాంతానికి చెందిన దళ కమాండర్ సృజనను ఆయన వివాహం చేసుకున్నారు. సృజన 2019లో గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
ఒకే ఒక్క ఫొటో...
తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లే ముందే తన ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ఇంట్లోని ఫొటోలు, కోరుట్ల జూనియర్ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలోని ఫొటోలు ఎవరికీ చిక్కకుండా చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి పోలీసులకు ఫొటోలు దొరకలేదు. దీంతో ఆయన ఆనవాళ్లు తెలుసుకోవడం కష్టంగా మారింది. మావోయిస్టుగా వివిధ హోదాల్లో కొనసాగిన సమయంలోనూ ఆయన ఫొటోలేవీ బయటకు రాలేదు. 1995లో దండకారణ్యంలో జరిగిన ఓ ప్లీనరీ సమావేశానికి హాజరైనప్పుడు ఒకరు తీసిన ఓ ఫొటోనే పోలీసులకు దొరికింది. ఇప్పటికీ ఆయన ఆనవాళ్ల కోసం ఆ ఫొటోనే అందుబాటులో ఉంది.


