లొంగిపోయిన దేవ్‌జీ! | Tippiri Tirupati Alias Devji Surrendered, 16 Associates Surrender To Police In Kumuram Bheem Asifabad | Sakshi
Sakshi News home page

లొంగిపోయిన దేవ్‌జీ!

Feb 23 2026 2:18 AM | Updated on Feb 23 2026 11:07 AM

Tippiri Tirupati alias Devji surrendered

రాజిరెడ్డి సహా 16 మందితో కలిసి ఆయుధాలు వీడిన మావో అగ్రనేత

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎస్‌ఐబీ పోలీసుల ఎదుట లొంగుబాటు 

దీనిపై తమకు సమాచారం ఉందన్న ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం 

ఇంకా ధ్రువీకరించని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు.. 

కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ లక్ష్యం ఇక నెరవేరినట్లేనని చర్చ

కోరుట్ల/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ అగ్రనేత, నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ ఎట్టకేలకు అజ్ఞాతం వీడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎస్‌ఐబీ పోలీసుల ఎదుట లొంగిపోయారని విశ్వసనీయ సమాచారం. ఆయనతోపాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌ సహా 16 మంది సహచరులు లొంగిపోయినట్లు తెలిసింది. 

ఇదే విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర హోంమంత్రి విజయ్‌శర్మ ఆదివారం రాయ్‌పూర్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు. దేవ్‌జీ, సంగ్రామ్‌ లొంగిపోయినట్లు తమకు సమాచారం ఉందన్నారు. అయితే ఈ వార్తలను తెలంగాణ పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. కాగా, దేవ్‌జీ లొంగుబాటు వార్తల నేపథ్యంలో    కేంద్రం సాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌–2 లక్ష్యం ఇక నెరవేరినట్లేనన్న చర్చ నడుస్తోంది. తిప్పిరి తిరుపతి స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల కాగా, రాజిరెడ్డి పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవారు. 

మా ప్రభుత్వానికి భారీ విజయం 
‘కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రణనీతి, ఛత్తీస్‌గఢ్‌ సీఎం అవలంబించిన విధానాల కారణంగా మావోయిస్టు పార్టీ మనుగడ అంతిమ దశకు చేరుకుంది. దేవ్‌జీ, సంగ్రామ్‌లు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, అబూజ్‌మడ్‌ అడవుల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరు అగ్రనేతల లొంగుబాటు మా ప్రభుత్వానికి భారీ విజయం. కానీ వారిద్దరి కంటే మరో సీనియర్‌ నేత (ముప్పాళ్ల లక్మణరావు) ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఆయన వయోభారంతో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారనే అంశంపై మాకు స్పష్టత లేదు. అగ్ర నాయకత్వంలో మరో నేత (మిసిర్‌ బెహ్రా) జార్ఖండ్‌లో ఉన్నారు. 

అజ్ఞాతంలో ఉన్న ఇంకొందరు సాయుధ మావోయిస్టుల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే కర్రెగుట్టల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్‌తో మాకు సత్ఫఫలితాలు వస్తున్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన 89 ఐఈడీలను నిరీ్వర్యం చేశాం. మారిన పరిస్థితులను గుర్తించి మిగిలిన వారు కూడా లొంగిపోతే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం’అని ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ చెప్పారు. 

మా కల నిజమైంది: తిరుపతి సోదరుడి కుమార్తె సుమ 
తిరుపతి లొంగుబాటు వార్త తెలియగానే ఆయన సోదరుడు గంగాధర్, ఆయన కుమార్తె సుమ, ఇతర బంధువులు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ‘పెద్దనాన్న లొంగిపోవాలని ఎన్నో లేఖలు రాశాను. మా ఆవేదనను పెద్దనాన్న అర్థం చేసుకున్నారు. ఏళ్ల తరబడి అడవుల్లో ఉండి అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేసిన ఆయన.. మా కోసం ఉద్యమాన్ని వీడి లొంగిపోయి వస్తున్నారన్న విషయం తెలియడంతో మా కల నిజమైందని సంబరపడుతున్నాం’అని సుమ చెప్పారు. అలాగే తిరుపతితో కలిసి కోరుట్ల జూనియర్‌ కళాశాలలో చదువుకున్న బక్కయ్య సైతం హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement