కాళేశ్వరాన్ని వదిలేయం వాడుకలోకి తెస్తాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On Kaleshwaram Project Works | Sakshi
Sakshi News home page

కాళేశ్వరాన్ని వదిలేయం వాడుకలోకి తెస్తాం: సీఎం రేవంత్‌

Feb 23 2026 1:48 AM | Updated on Feb 23 2026 8:31 AM

CM Revanth Reddy Comments On Kaleshwaram Project Works

మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి, ఎంపీ కడియం కావ్య

రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

భూసేకరణే అసలు సమస్య... ఫలితంగా అంచనాలు పెరిగాయి.. 

పది సంవత్సరాలు పాలించిన వారు

ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.. 

ఎన్ని ఇబ్బందులెదురైనా భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్‌ ఫండ్‌ 

దేవాదుల కోసం జూన్‌ 2లోపు రూ.600 కోట్లు ఇస్తామని వెల్లడి

దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన సీఎం, మంత్రులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం మహా అద్భుతం అన్నారని.. తాము వచ్చినప్పటి నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయలేదని చెప్పారు. అయినా దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయకుండా ఉపయోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. ఒక్క కాళేశ్వరం పైనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం మిగతా ప్రాజెక్టులను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్న మాట వాస్తవమే అయినా, వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును అలాగే వదిలేయలేమని చెప్పారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా నిపుణుల కమిటీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వాడుకలోకి తెస్తామని ప్రకటించారు.  

ఆదివారం ఉమ్మడి వరంగల్‌లో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో కలిసి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఇంటెక్‌వెల్‌ వద్ద మోటార్లను సందర్శించిన ఆయన.. దేవాదుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పాయింట్‌ వద్ద ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రేవంత్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 వేల పుస్తకాలు చదివామని చెబుతున్న జ్ఞానవంతులు ఆనాడు 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రెండు మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. 

భూసేకరణే అసలు సమస్య...  
ప్రాజెక్టులు పూర్తి చేయడానికి భూసేకరణే అసలు సమస్యగా మారిందని, ఫలితంగా ప్రాజెక్టుల అంచనాలు కూడా పెరిగాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లు పాలించిన వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేంది కాదన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని, దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం జూన్‌ 2లోపు రూ.600 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. 

దేవాదుల ప్రాజెక్టు 2001లో రూ.6,000 కోట్ల అంచనాతో ప్రారంభమై ప్రస్తుతం రూ.18,500 కోట్లకు పెరిగిందని, ఆ మేరకు బడ్జెట్‌లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మార్చిలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో దేవాదులపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక నెలలోపు దేవాదుల పంపులను మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు.  

చంద్రబాబుకు సహకరించలే.. 
తెలంగాణ నీటి హక్కులను కాపాడుతూ అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, గత ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని చెప్పారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు కాకుండా సూచనలు ఇస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. ‘అధికారం, పదవులు వారసత్వంగా రావు.. ప్రజలే నిర్ణయిస్తారు.. పదవులు ఎవరి సొత్తు కాదు.. ప్రజల ఆశీస్సులతోనే పదవులు వస్తాయి’అని రేవంత్‌రెడ్డి అన్నారు. 2034 వరకు మరో పదేళ్లు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.  
 
వెన్నం సోదరులకు సీఎం పరామర్శ 
మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లాలోని రెడ్యాల గ్రామానికి చెందిన వెన్నం రాఘవేందర్‌రెడ్డి మృతిచెందగా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం వెన్నం సోదరులను పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా రెడ్యాల గ్రామానికి చేరుకున్న రేవంత్‌రెడ్డి.. రాఘవేందర్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు రాష్ట్ర సంవిధాన్‌ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, బిగ్‌ టీవీ చైర్మన్‌ వెన్నం విజయకాంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement