తెలంగాణ నుంచి 17 మంది మావోయిస్టులు ఉన్నట్టు ప్రకటించిన పోలీసులు
అందులో బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్‌ల పేర్లు లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన
‘మా అన్న నక్సల్స్‌లోకి వెళ్లాడు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. లొంగిపోవాలని చెప్పారు. నిన్న డీజీపీ చెప్పిన లిస్టులో మా అన్న పేరు లేదు. ఎక్కడున్నాడో కనీసం మావోయిస్టు బాధ్యులు కూడా చెప్పడం లేదు. అన్నలు, పోలీసులు ఎవరు ఆచూకీ చెప్పకుంటే ఎలా’అని కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన బెజ్జారపు కిషన్ తమ్ముడు ఆంజనేయులు ప్రశ్న. కిషన్ భార్య కూడా తన భర్త ఎక్కడున్నాడో తెలపాలని వేడుకుంటోంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి 44 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన నిజాముద్దీన్ కుటుంబ పరిస్థితి కూడా దాదాపు ఇదే. మావో టెక్ విభాగ ఇన్‌చార్జ్‌గా పనిచేసినట్టు చెప్పుకున్న నిజాముద్దీన్ ఆచూకీ ఎక్కడా దొరకడం లేదు. ఇలా ఉత్తర తెలంగాణ నుంచి నక్సల్స్ ఉద్యమంపై ఆసక్తితో అజ్ఞాతంలోకి వెళ్లి జాడ లేకుండా పోయిన వారు పదుల సంఖ్యలో ఉంటారని అంచనా.
కోరుట్ల: కోరుట్ల నుంచి ప్రస్తుత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లడానికి మూడేళ్ల ముందే అంటే.. 1982లో కోరుట్లకు చెందిన బెజ్జారపు కిషన్, మహ్మద్ నిజాముద్దీన్ నక్సల్స్‌లో చేరి దళాల్లో వివిధ హోదాల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ప్రకటించిన లిస్టులో ఈ ఇద్దరి వివరాలు లేవు.
⇒ కోరుట్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ముక్కా వెంకటేశం డీసీఎం స్థాయిలో 1998లో యాదగిరిగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.
⇒ పసుల రాంరెడ్డి తెలంగాణ పశ్చిమ డివిజన్ దళానికి డీసీఎంగా పనిచేస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వద్ద 2000 సంవత్సరంలో జరిగిన మద్దిమల్ల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
ఈ లెక్కన కోరుట్ల నుంచి నక్సల్స్‌లోకి వెళ్లిన బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్, తిప్పిరి తిరుపతి, ముక్కా వెంకటేశం, పసుల రాంరెడ్డిల్లో ఇద్దరు ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా.. మరో ఇద్దరు జాడ లేకుండా పోయారు. ఏడాది క్రితం వరకు తెలంగాణ నుంచి 55 మంది వరకు మావోయిస్టుల్లో ఉన్నారని పోలీసు రికార్డులు చెబుతుండగా, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారని..వారి పేర్లు ప్రకటించడం గమనార్హం.
దీంతో ఇప్పటి వరకు ‘మావో’ల్లోనే మావారు ఉన్నారని అనుకొని వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నాయి. పౌరహక్కుల సంఘాలు, ఇతర మార్గాల ద్వారా మావోయిస్టు ప్రతినిధులకు సమాచారం పంపినా ఫలితం దక్కలేదు. ఆచూకీ లేకుండా పోయిన వారు ఉద్యమంలో ఉన్నారా? జైళ్లలో ఉన్నారా ? లేకుంటే చనిపోయారా? అన్న విషయంలో మావోయిస్టులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.


