తాడేపల్లి : ఏపీలో పోలీసుల వైఖరి వింతగా ఉందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి విమర్శించారు. కేక్ కట్ చేసినా, కోడిని కోసుకున్నా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. చివరికి జగన్ ఫ్లెక్సీలను చూసినా కేసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.
‘ఇది రెడ్ బుక్ పాలనకు నిదర్శనంగా ఉంది. జగన్ పుట్టినరోజున కోడిని కోశారని తిరుపతిలో కేసు పెట్టి అపహాస్యానికి గురయ్యారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు కూడా చేశారు. వారిని కోర్టులో హాజరుపరిస్తే కోర్టు సైతం దిగ్భ్రాంతికి గురైంది. కేక్ ను కత్తితో కట్ చేశారని ఇంకో కేసు కూడా పెట్టారు. అసలు రాష్ట్రంలో పోలీసుల వైఖరి దారుణంగా ఉంది. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందేలు జరుగుతున్నాయి. కోళ్ల పందేలు చట్టరిత్యా నేరం.మరి సంక్రాంతి సందర్భంగా జరిగే కోళ్ల పందేలపై పోలీసులు ఏం చేయబోతున్నారు?.
కనుమ రోజు అందరూ నాన్ వెజ్ తింటారు అప్పుడు కూడా జనం మీద కేసులు పెడతారా?, జగన్ ఫ్లెక్సీలను జనం చూస్తే వారి మీద కూడా కేసులు పెట్టేలా ఉన్నారు, నిందితులకు ముసుగులు వేయకూడదు, కొట్టకూడదు, రోడ్లమీద ఊరేగించ కూడదు, చేతులకు సంకెళ్లు వేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టులు చాలాసార్లు చెప్పాయి. చట్టప్రకారం పని చేయకపోతే తర్వాత పోలీసులే ఇబ్బంది పడతారు. అధికరం శాశ్వతం కాదు, పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలి’ అని హెచ్చరించారు.


