సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే, గతంలో ఇచ్చిన నోటీసుకు ఆయన సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని కోరడంతో దానం నాగేందర్ మరో నోటీసును స్పీకర్ నుంచి అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లో (అక్టోబర్ 31, 2025 నాటికి) విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ అనర్హత పిటిషన్లపై విచారణను ఇప్పటికే ప్రారంభించారు. అయితే, విచారణను మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ విపక్ష బీఆర్ఎస్ నవంబర్ 17న సుప్రీంకోర్టులో స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, ఈ వ్యవహారంలో స్పీకర్ వేగం పెంచారు. మరోవైపు, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటివరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది.


