సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రోడ్డు భద్రతను మిషన్ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లే దిశగా ‘అరైవ్ అలైవ్–2026’ కార్యక్రమం మరో ముందడుగు వేసింది. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్–2026 టేబుల్‌టాప్ క్యాలెండర్ను విడుదల చేసి, ఆలోచనల నుంచి అమలుకు మారుతున్న స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. ఈ కార్యక్రమం డీజీపీ బి. శివధర్ రెడ్డి నేతృత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నత పోలీసు అధికారుల సహకారంతో కొనసాగుతోంది.
ఈ ప్రచారంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ ప్రతినిధులు మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్‌ను కలిశారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడంలో సాంకేతికత ఆధారిత చర్యలు, ప్రజల భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సమావేశంలో ముఖ్య ఆకర్షణగా ఏఐ ఆధారిత ట్రాఫిక్ లా కంప్లయన్స్ వాహనం (TLCV)ను కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వయంగా టెస్ట్ రైడ్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించడం, ప్రజా భద్రతను మెరుగుపరచడంలో ఈ వాహనం కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ‘అరైవ్ అలైవ్’ కేవలం ప్రచారం కాదని, ప్రతి కుటుంబం సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్న బాధ్యతగా రాష్ట్రం ముందుకు సాగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.


