సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కవిత పార్టీ పెట్టుకుంటే మారేది ఏమీ లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ వేయాలి. ఆరోపణలు చేసిన కవిత.. తన వద్ద ఉన్న ఆధారాలను ఆ కమిషన్‌కు ఇవ్వాలి. ఇన్నాళ్లు అవినీతిలో అంటకాగి పంపకాల్లో తేడాలతోనే కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. లిక్కర్ వ్యాపారం చేసి కవిత జైలుకు వెళ్లారు. లిక్కర్ కేసులో డబ్బులు సంపాదించారు.
కవిత జైలుకు వెళ్లితే బీజేపీకి ఎం సంబంధం?. తప్పుచేసిన వారిని పార్టీలు జైలులో వేయవు. దర్యాప్తు సంస్థలు వేస్తాయి. కవితకు మాత్రమే ఆత్మగౌరవం ఉందా? తెలంగాణ ప్రజలకు లేదా?. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో అనేది వాళ్ల కుటుంబ అంశం మాత్రమే. ఇన్నాళ్లు వాళ్లతో ఉన్నప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదు. ఉద్యమ ద్రోహులు బీఆర్‌ఎస్‌లో చేరారని మేము మొదటి నుంచి చెప్పాం’ అంటూ కామెంట్స్ చేశారు.


