ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ పర్యటనలో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారాన్ని డీకే శివకుమార్ తోసిపుచ్చారు. అలాంటిదేం ఉండబోదని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా తానే ఆ పదవిలో ఉంటానని.. పార్టీని గెలిపించుకుని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసి వచ్చారు. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఇవాళ ఆ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ డీకే శివకుమార్ ప్రకటించడం గమనార్హం.
2026 మార్చికి శివకుమార్ పీసీసీ పదవీకాలం ఆరేళ్లు పూర్తి కానుంది. అయితే.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచరులు కొత్త పీసీసీ చీఫ్‌ను చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రేసులో సతీష్ జర్కీహోళీ, మంత్రి ఈశ్వర ఖాంద్రే పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ అంశంపై రేపు(గురువారం) స్పష్టమైన ప్రకటన ఉంటుందని మాజీ ఎంపీ డీకే సురేష్ చెబుతున్నారు. ఇంకోపక్క.. డీకే శివకుమార్ వర్గీయుడు ఎమ్మెల్యే హచ్‌డీ రంగనాథ్ సిద్ధరామయ్య ప్రభుత్వం బాగా పని చేస్తోందని.. అంతా సవ్యంగానే ఉందంటూ వ్యాఖ్యానించడంతో నాయకత్వ మార్పు ఉండకపోవచ్చనే కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
2023 మే నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా కింద వీళ్లిద్దరినీ కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించిందని.. చెరో రెండున్నరేళ్లు సీఎంలుగా ఉంటారనే ప్రచారం నడిచింది(ఇద్దరూ దానిని ఖండించారు కూడా). అదే సమయంలో.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు డీకే శివకుమార్ సిద్ధపడ్డారు. అయితే.. ఖర్గే, రాహుల్ గాంధీ వద్దని సూచించడంతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. మరోపక్క లోక్‌సభ ఎన్నికల దాకా డీకేనే పీసీసీ చీఫ్‌గా కొనసాగుతారని పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.