సాక్షి చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల పంపకాలపై సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 40 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తుండగా.. డీఎంకే అందుకు ఇంకా స్పందించలేదు. ఒకవేళ సీట్ల పంపకం తేలనిపక్షంలో విజయ్ టీవీకే పార్టీతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది.
తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు పొత్తుల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. అధికార డీఎంకేతో కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాయి. దీంతో సీట్ల షేరింగ్ అంశంపై రెండుపార్టీల మధ్య ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ సీట్లు తమ పార్టీకి కేటాయించాలని డీఎంకేను కోరినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్ పార్టీ 32 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ కనీసం 38 స్థానాలకైనా పరిమితం కావాలని భావిస్తోందట. కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది" అని వ్యాఖ్యానించారు. దీంతో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు.
ఇటు కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీ టీవీకేతో పొత్తుపెట్టుకునే అవకాశాల్ని పూర్తిగా కొట్టిపడేసే అవకాశాలు లేవు. ఇటీవల ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫిలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ " కాంగ్రెస్, టీవీకే పార్టీలు సహజమిత్రులు. రాహుల్ గాంధీ, విజయ్ మంచి స్నేహితులు, రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలు అధికంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించడం కలకలమే రేపింది. దీంతో.. బీజేపీ రంగంలోకి దిగింది.
బీజేపీ సైతం విజయ్ పార్టీతో పొత్తుకోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తమిళనాడులో పర్యటించిన అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షా ఉద్దేశపూర్వకంగానే అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి పళనిస్వామిని కలవకుండా వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తుల అంశంపై తమ అధినేత విజయ్‌తో చర్చించాకే ఏ నిర్ణయమనేది ప్రకటిస్తామని టీవీకే నేతలు చెబుతుండడం గమనార్హం.


