సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: వీధి శునకాలకు సంబంధించి తమ వద్ద విచారణలో ఉన్న కేసుకు అనుబంధంగా కుప్పలుతెప్పలుగా అనుబంధ పిటిషన్లు, దరఖాస్తులు వచ్చిపడుతున్నాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. వీధి శునకాలకు సంబంధించిన కేసును బుధవారం విచారిస్తామని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల ధర్మాసనం గుర్తుచేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇప్పటికే పలువురు లాయర్లు ఈ అంశంలో అనుబంధ పిటిషన్లు, దరఖాస్తులు ఇచ్చారు.
మళ్లీ ఇద్దరు లాయర్లు ఇదే కేసుపై దరఖాస్తులు సమర్పించి సంబంధిత ధర్మాసనానికి బదిలీచేయాలని విజ్ఞప్తిచేశారు. సాధారణంగా చూస్తే మనుషులకు సంబంధించిన ఏ కేసులో కూడా ఇన్ని అప్లికేషన్లు రాలేదేమో. కుక్కల విషయంలో పిటిషన్లు పోటెత్తుతున్నాయి. ఇలాంటి అప్లికేషన్లు బుధవారం కూడా వస్తాయేమో. అన్నీ కలిపి బుధవారమే కేసును విచారిస్తాం’’అని సుప్రీంకోర్టు వెల్లడించింది.


