లిస్ట్-ఏ క్రికెట్‌లో కర్ణాటక ఆటగాడు, టీమిండియా తాజా సంచలనం దేవ్‌దత్ పడిక్కల్ తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికే 5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు చేసిన పడిక్కల్.. తాజాగా మరో సెంచరీని తృటిలో మిస్ అయ్యాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 6) జరుగుతున్న మ్యాచ్‌లో 82 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి 9 పరుగుల స్వల్ప తేడాతో సెంచరీని కోల్పోయాడు.
తాజా ప్రదర్శనతో పడిక్కల్ మరోసారి భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఇప్పటికే ఏం చేయాలో తెలియక జట్టు పీక్కుంటున్న సెలెక్టర్లను పడిక్కల్ మరింత ఇరకాటంలో పడేశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ఇదివరకే ప్రకటించడంతో పడిక్కల్ టీమిండియా తలుపులు తట్టేందుకు ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. 38 ఇన్నింగ్స్‌ల స్వల్ప లిస్ట్-ఏ కెరీర్‌లో పడిక్కల్ 13 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు చేసి తిరుగులేని రికార్డు కలిగి ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. పడిక్కల్ సెంచరీ మిస్ అయినా మరో ఓపెనర్ కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (100) సెంచరీతో మెరిశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక భారీ స్కోర్ (324/7) చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగాడు. 28 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ 14 పరుగులకే ఔటై నిరాశ పరిచాడు. రాజస్థాన్ బౌలర్లలో కుక్కా అజయ్ సింగ్, మానవ్ సుతార్ చెరో 2, ఖలీల్ అహ్మద్, అమన్ సింగ్, అశోక్ శర్మ తలో వికెట్ తీశారు.
చరిత్ర సృష్టించిన పడిక్కల్
తాజా ఇన్నింగ్స్‌తో ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఎడిషన్‌లో పడిక్కల్ పరుగుల సంఖ్య 600 మార్కును దాటింది. పడిక్కల్ గతంలోనూ రెండు ఎడిషన్లలో 600 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. తద్వారా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో మూడు వేర్వేరు ఎడిషన్లలో 600 పరుగులు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
పడిక్కల్ తొలిసారి 2019-2020 ఎడిషన్‌లో 600 పరుగుల మార్కును (11 ఇన్నింగ్స్‌ల్లో 609 పరుగులు) తాకాడు. ఆతర్వాతి ఎడిషన్‌లో (2020-21) మరోసారి 600 మార్కును దాటాడు. ఈసారి 8 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 737 పరుగులు సాధించాడు. ఆ ఎడిషన్‌లో అతను వరుసగా నాలుగు సెంచరీలు చేసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రస్తుత ఎడిషన్‌లో (2025-26) పడిక్కల్ మూడోసారి 600 పరుగుల మార్కును దాటాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను.. నాలుగు సెంచరీలు, ఓ భారీ హాఫ్ సెంచరీ సాయంతో 605 పరుగులు చేశాడు.


