విజయనగర జిల్లా: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో వరుసగా హత్యలు జరగడంతో నగర ప్రజలు హడలెత్తుతున్నారు. ఇటీవల తాలూకాలోని కారిగనూరు వద్ద పురుషుడు, కమలాపుర సమీపంలోని వెంకటాపుర క్యాంప్‌లో వివాహిత హత్య ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్య కేసులను మరువక ముందే నగరంలోని చాపలగడ్డ ప్రాంతంలో మంగళవారం ఉదయం మరో మహిళ గొంతు కోసి హత్య చేసిన ఘటన నగరంలో చర్చనీయంగా మారింది. హత్యకు గురైన మహిళ ఉమా (35) నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చాపలగడ్డ ప్రాంతవాసి. ఆమె భర్త ఖాజా హుస్సేన్ ని చిత్తవాడ్గి పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవలే రెండో పెళ్లి..
ఉమాకు 13 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘు అలియాస్ రామాంజినితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉమా గత 6 ఏళ్లుగా తన భర్త నుంచి విడిపోయి చాపలగడ్డలోని తన ఇంట్లో ఉంటోంది. ఉమా నాలుగు నెలల క్రితం నగరానికి చెందిన ఖాజా హుస్సేన్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని కొండనాయకనహళ్లిలోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకొంది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో ఖాజా హుస్సేన్ కోపోద్రేకంలో ఉమాను కత్తితో గొంతు కోసి చంపినట్లు చిత్తవాడిగి పోలీసులు తెలిపారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై చిత్తవాడిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భర్తపై భార్య దాడి
బనశంకరి: రెండో భార్యను వదిలేయాలని మొదటి భార్య.. భర్తపై (రౌడీషిటర్) దాడికి పాల్పడింది. ఈ ఘటన జేజే నగర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దాడికి గురైన భర్త మొదటి భార్యపై జేజే నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. జేజే నగర నివాసి సయ్యద్ అస్గర్ చోరీలు, డ్రగ్స్ విక్రయాల కేసులో జైలు పాలయ్యాడు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్యను వదిలేయాలని భర్త సయ్యద్ అస్గర్‌ను మొదటి భార్య కోరింది. భర్త ఒప్పుకోక పోవడంతో మొదటి భార్య దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ అస్గర్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేజే నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


