చండీగఢ్: ఓ వ్యక్తి 19 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. మొదటి సంతానంగా కుమార్తె పుట్టింది. కానీ కుమారుడు కావాలనే కోరికతో.. కొడుకు పుట్టేవరకు సంతానాన్ని కొనసాగించాడు. అలా 10 మంది కుమార్తెలు పుట్టగా.. చివరికి 11వ సంతానంగా కుమారుడు జన్మించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే?
హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాలోని ఉచానా పట్టణంలో 37 ఏళ్ల మహిళ తన 11వ సంతానంగా కుమారుడికి జన్మనిచ్చింది. అంతకుముందు ఆమెకు 10 మంది కుమార్తెలు ఉన్నారు. ఈ డెలివరీ వైద్యపరంగా ప్రమాదకరంగా ఉన్నప్పటికీ, తల్లీబిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
డాక్టర్ నర్వీర్ శియోరాన్ ప్రకారం..ఈ డెలివరీ ఓజాస్ హాస్పిటల్ అండ్ మేటర్నిటీ హోమ్లో జరిగింది. డెలివరీ సమయంలో తల్లికి మూడు యూనిట్ల రక్తం ఇవ్వాల్సి వచ్చింది. జనవరి 3న మహిళను ఆసుపత్రిలో చేర్చగా.. జనవరి 4న శిశువు జన్మించాడు. ఆ రోజే తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా గ్రామానికి తిరిగి వెళ్లారు.
మహిళ, ఆమె భర్త సంజయ్ కుమార్ (రోజువారీ కూలీ) 19 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇప్పటివరకు వారికి 10 మంది కుమార్తెలు ఉన్నారు. ఈసారి కుమారుడు పుట్టడంతో కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
ఇక్కడ విచిత్రం ఏంటంటే? కుమారుడు పుట్టినందుకు సంతోషంగా ఉన్నప్పటికి.. ‘మేము పితృస్వామ్యాన్ని ప్రోత్సహించడం లేదు’అని తండ్రి స్పష్టం చేశారు. ‘మాకు కుమార్తెలు కూడా సమానమే. కానీ ఒక కుమారుడు ఉండాలని ఆశించాం. ఇప్పుడు ఆ ఆశ నెరవేరింది’ అని ఆయన అన్నారు.
ఈ సంఘటనతో మాతృ ఆరోగ్యంపై ఉన్న ప్రమాదాలు మళ్లీ చర్చకు వచ్చాయి. కుమారుడి కోసం నిరంతరం గర్భధారణలు చేయడం మహిళల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంకా కొంతమంది కుటుంబాల్లో కుమారుడి కోసం ఉన్న పట్టుదల సమాజంలో పితృస్వామ్య భావజాలం కొనసాగుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


