ఢిల్లీ, ముంబై, పంజాబ్ కూడా
విజయ్ హజారే వన్డే టోర్నమెంట్
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక, ఢిల్లీ, యూపీ, ముంబై, పంజాబ్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 150 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గెలుపొందింది. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన కర్ణాటక అన్నింట్లోనూ గెలిచి 24 పాయింట్లతో క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.
కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకోగా... దేవదత్ పడిక్కల్ (82 బంతుల్లో 91; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్తాన్ 38 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. కరణ్ లాంబా (55)టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మానవ్ సుతార్ (4), దీపక్ హూడా (29) సహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 5 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడు 54 పరుగుల తేడాతో త్రిపురపై... జార్ఖండ్ 2 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌పై... కేరళ 8 వికెట్ల తేడాతో పాండిచ్చేరిపై విజయాలు సాధించాయి.
యూపీ ‘సిక్సర్’
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్టు విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో వరుసగా ఆరో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్ 54 పరుగుల తేడాతో విదర్భపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తర ప్రదేశ్ నిరీ్ణత 50 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ గోస్వామి (109 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెపె్టన్ రింకూ సింగ్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధ్రువ్ జురేల్ (56; 5 ఫోర్లు, 1 సిక్స్), ప్రియమ్ గార్గ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అనంతరం ఛేదనలో విదర్భ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులకు పరిమితమైంది.
అమన్ మోఖడే (117 బంతుల్లో 147; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘శత’క్కొట్టగా... అక్షయ్ వాడ్కర్ (51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీ సాధించాడు. యూపీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... కార్తిక్ త్యాగీ, విప్‌రాజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు తీశారు. గ్రూప్ దశలో ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన యూపీ జట్టు 24 పాయింట్లతో ‘టాప్’లో నిలిచి క్వార్టర్స్‌కు చేరింది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో బరోడా 76 పరుగుల తేడాతో జమ్ముకశ్మీర్‌పై... హైదరాబాద్ 107 పరుగుల తేడాతో జమ్మూకశ్మీర్‌పై... చండీగఢ్ 7 వికెట్ల తేడాతో అస్సాంపై గెలుపొందాయి.
గెలిపించిన శ్రేయస్, ముషీర్
యువ ఆటగాడు ముషీర్ ఖాన్ (51 బంతుల్లో 73; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు; 1/47) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చడంతో ముంబై జట్టు ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా... మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించగా... మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 9 ఓవర్లలో 299 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (53 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముషీర్ ఖాన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్ (21), సూర్యకుమార్ యాదవ్ (24), శివమ్ దూబే (20) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. గాయం నుంచి కొలుకున్న అనంతరం ఆడిన తొలి మ్యాచ్‌లో శ్రేయస్ చక్కటి స్ట్రోక్ ప్లేతో అదరగొట్టాడు.
హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో వైభవ్ అరోరా, అభిషేక్ కుమార్, కుషాల్ పాల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో హిమాచల్ ప్రదేశ్ 32.4 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. పుఖ్‌రాజ్ మన్ (64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంకుష్ బెయిన్స్ (53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మయాంక్ డాగర్ (64; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే 4 వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ ‘సి’లో పంజాబ్, ముంబై చెరో 5 విజయాలతో 20 పాయింట్లు సాధించి పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి.. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఉత్తరాఖండ్ 6 వికెట్ల తేడాతో సిక్కీంపై... పంజాబ్ 6 వికెట్ల తేడాతో గోవాపై... ఛత్తీస్‌గఢ్ 6 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలిచాయి.
ప్రియాన్‡్ష ఆర్య మెరుపులు
వికెట్ కీపర్ రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు విజయ్ హజారే టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఆలూరు వేదికగా జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో రైల్వేస్‌పై గెలుపొందింది. మొదట రైల్వేస్ 40.4 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. కుష్ మరాథె (51; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఆయుశ్ బదోనీ, నవ్‌దీప్ సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 21.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రియాన్‡్ష ఆర్య (41 బంతుల్లో 80; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... సార్థక్ రంజన్ (33; 5 ఫోర్లు), నితీశ్ రాణా (38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషబ్ పంత్ (24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) తలో చేయి వేశారు.
గ్రూప్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచిన ఢిల్లీ 20 పాయింట్లతో పట్టికలో ‘టాప్’లో నిలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఢిల్లీ జట్టు ఈ టోరీ్నలో నాకౌట్ దశకు చేరడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఇదే గ్రూప్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో సౌరాష్ట్ర 111 పరుగుల తేడాతో సర్వీసెస్‌పై... గుజరాత్ 233 పరుగుల తేడాతో ఒడిశాపై విజయాలు సాధించగా... హరియాణా, ఆంధ్ర జట్ల మధ్య మ్యాచ్ ‘టై’గా ముగిసింది. మరోవైపు ప్లేట్ గ్రూప్ ఫైనల్లో బిహార్ 6 వికెట్ల తేడాతో మణిపూర్‌పై విజయం సాధించింది.


