బర్సె దేవా లొంగుబాటుకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రయత్నాలు
చివరి నిమిషంలో లొంగిపోయేందుకు రాష్ట్రాన్ని ఎంచుకున్న దేవా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పీఎల్‌జీఏ బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవా లొంగుబాటు విషయంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు పోటాపోటీగా వ్యూహాలు అమలు పరిచినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పీఎల్‌జీఏ బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవాను లొంగిపోవాలని కోరుతూ వారి స్వగ్రామమైన పూవర్తికి ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ గతేడాది నవంబర్ 6న వెళ్లారు. హిడ్మా, దేవా తల్లులైన పొజ్జి, హింగేలతో కలిసి భోజనం చేశారు. ఇద్దరూ లొంగిపోవాలని వారి తల్లులతో పిలుపునిప్పించారు.
అయితే నవంబర్ 18న ఏపీలో జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయాడు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు మద్దతుదారులతోపాటు స్థానిక ప్రజానీకంలోనూ హిడ్మా పట్ల సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్‌గఢ్ సర్కార్, అటు కేంద్రం తదుపరి ఆపరేషన్లపై ఆచితూచి వ్యవహరించాయి. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో మైనింగ్ కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ రణరంగంగా మారడం పరిస్థితి తీవ్రతను మరింతగా పెంచింది. దీంతో ఎన్‌కౌంటర్లకు బదులు తమ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ద్వారా బర్సె దేవాను లొంగుబాటుకు ఒప్పించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయతి్నంచినట్టు సమాచారం.
అప్రమత్తమైన తెలంగాణ
ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి వచ్చిన లొంగుబాటు ప్రయత్నాలపై నిర్ణయం తీసుకునే విషయంలో బర్సె దేవా ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్టు తెలుస్తోంది. చివరకు ఛత్తీస్‌గఢ్ కంటే తెలంగాణలో లొంగిపోవడమే మేలని భావించి ఇటు దిశగా వచి్చనట్టు సమాచారం. అయితే, అనుకున్నంత వేగంగా లొంగుబాటు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో తన ‘నెట్‌వర్క్’ద్వారా బర్సె దేవా ఛత్తీస్‌గఢ్ పోలీసుల టచ్‌లోకి వెళ్లేందుకు ప్రయతి్నంచినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు లొంగుబాటు ‘ముచ్చట్లు’సాగించేందుకు అక్కడి నుంచి ప్రతినిధులు గోదావరి తీర ప్రాంత అడవుల్లోకి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. వెనువెంటనే బర్సె దేవా ‘లొకేషన్’కు చేరుకొని, అక్కడి నుంచి సరెండర్ ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా బర్సె దేవా బృందం మాయం కావడంతో పౌరహక్కుల సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి.
వరుస ఎన్‌కౌంటర్లు
హిడ్మా ఎన్‌కౌంటర్‌తో జరిగిన డ్యామేజ్‌ను ఎంతో కొంత పూడ్చుకునేందుకు బర్సె దేవా లొంగుబాటును ఉపయోగించుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో బస్తర్‌లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో ఉన్న బలగాలు తమ పంథాను మార్చుకున్నట్టు సమాచారం. బర్సె దేవా లొంగుబాటు ప్రక్రియ అధికారికంగా జరగాల్సిన రోజు ఉదయమే బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వేర్వేరుగా రెండు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఆ రోజు 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు బర్సె దేవా లొంగుబాటు విషయంలో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుకు అతని స్వగ్రామమైన పూవర్తి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


