వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇరు దేశాల మధ్య 28 పాయింట్లతో శాంతి ప్రణాళికను ట్రంప్ ఆమోదించారు. ఇందులో పుతిన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ట్రంప్.. జెలెన్‌స్కీకి బిగ్ షాకిచ్చారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా ఫైనాన్షియల్ టైమ్స్ కథనాల్లో వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, తాజాగా యుద్ధానికి ముగింపు కోసం 28 పాయింట్లతో ఒక ప్లాన్ సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఇటీవల దానిని జెలెన్‌స్కీ ప్రభుత్వానికి అందించారు. దీనిపై ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఉక్రెయిన్ జాతీయ భద్రతాధిపతి రుస్తుమ్ ఉమరోవ్ మధ్య సమావేశం జరిగింది. ఈ ప్రణాళికకు అంగీకారం తెలపాలని అమెరికా కోరుకుంటుందని ఆ సందర్భంగా విట్కాఫ్ స్పష్టం చేశారు.
అయితే, అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో, పలు నిబంధనలను జెలెన్‌స్కీ వ్యతిరేకిస్తున్నారు. వాటిని అంగీకరించడం అంటే తమ సార్వభౌమత్వాన్ని వదులుకోవడమేనని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మిత్ర దేశం నిరాకరిస్తున్నా.. ట్రంప్ మాత్రం దానికి మద్దతు తెలిపారని ఆ కథనం పేర్కొంది.
కీలక పాయింట్లు ఇవే..
ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి.
ఉక్రెయిన్ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి.
ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు.
ఉక్రెయిన్ తూర్పు డాన్‌బాస్‌లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి.
రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఎవరూ అందించకూడదు అనేవి ముఖ్యమైనవిగా ఉన్నాయి.


