నోబెల్‌ శాంతికి నేనే బెస్ట్‌: ట్రంప్‌  | I am the best candidate for the Nobel Peace Prize Says Donald Trump | Sakshi
Sakshi News home page

నోబెల్‌ శాంతికి నేనే బెస్ట్‌: ట్రంప్‌ 

Jan 11 2026 6:13 AM | Updated on Jan 11 2026 6:13 AM

I am the best candidate for the Nobel Peace Prize Says Donald Trump

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: గతేడాది నోబెల్‌ శాంతి బహుమతి తనకు దక్కలేదన్న అక్కసును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వెళ్లగక్కారు. అసలు ఆ పురస్కారానికి తనకంటే అర్హుడు చరిత్రలోనే మరెవరూ లేరని చెప్పుకున్నారు. వెనెజువెలా చమురు నిల్వలకు సంబంధించిన ప్రణాళికల గురించి చర్చించేందుకు చమురు, సహజవాయు కంపెనీల ఉన్నతాధికారులతో శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిపిన సమావేశాన్ని ట్రంప్‌ ఇందుకు వేదికగా మార్చుకోవడం విశేషం. 

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ఏమీ చేయకపోయినా నోబెల్‌ శాంతి పురస్కారం దక్కిందంటూ ఈ సందర్భంగా ఆయన వాపోయారు. ‘‘రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక కేవలం 8 నెలల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 అతి పెద్ద యుద్ధాలను ఆపాను. 36 ఏళ్లు, 32, 31, 28, 25 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాలవి. తద్వారా లక్షలాది మంది ప్రజలు చనిపోకుండా కాపాడా’’అన్నారు. అంతేకాదు, ‘భారత్, పాకిస్తాన్‌ మధ్య పూర్తిస్థాయి యుద్ధం దిశగా వెళ్తున్న భారీ ఘర్షణను కూడా ఆపేశా’నని మరోసారి చెప్పుకున్నారు. 

రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి లక్షలాదిగా ప్రాణ నష్టాన్ని నివారించినందుకు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా తనకు కృతజ్ఞతలు కూడా తెలిపారని గుర్తు చేశారు. భారత్, పాక్‌ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్‌ చెప్పుకోవడం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి. ‘‘అసలు ఒబామాకు నోబెల్‌ పురస్కారం ఎందుకిచ్చారో ఇప్పటికీ కనీసం ఆయనకు కూడా తెలియదు. నాకు మాత్రం వాస్తవానికి నేను ఆపిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్‌ శాంతి బహుమతి చొప్పున ఇవ్వాలి’’అని చెప్పుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement