‘ఆయుధాలు వీడకుంటే చావే’: ట్రంప్ తీవ్ర హెచ్చరిక | Trump Issues Warning To Iran After US-Israel Strikes On Nuclear Facilities, Says Lay Down Your Arms Or Face Certain Death, Video Inside | Sakshi
Sakshi News home page

‘ఆయుధాలు వీడకుంటే చావే’: ట్రంప్ తీవ్ర హెచ్చరిక

Feb 28 2026 1:26 PM | Updated on Feb 28 2026 1:47 PM

Lay down your arms or face certain death Trump

వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇరాన్ అణు కార్యక్రమ పునరుద్ధరణ ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆ దేశంపై మెరుపు దాడులు జరిపాయి. ఈ దాడిని ధృవీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ పాలకులకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తక్షణమే ఆయుధాలను వీడాలని, లేనిపక్షంలో మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్ఛరించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదన్నదే తమ ఏకైక లక్ష్యమని, అందుకోసం ఆ దేశ అణు కేంద్రాలను అమెరికా సర్వనాశనం చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులు చేపట్టిందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులు చేశామని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు మళ్లీ తయారు చేస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండడం వల్లే దాడులు తీవ్రతరం చేశామన్నారు. ఇరాన్ మద్ధతుతోనే హామాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోందని ఇరాన్‌లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని రూపుమాపుతామని ట్రంప్‌ హెచ్చరించారు.

టెహ్రాన్ లోని దుష్ట నియంతృత్వ పాలనను అంతమొందించే లక్ష్యంతో భారీ పోరాట కార్యకలాపాలు ప్రారంభమైనట్లు ట్రంప్‌  అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ట్రంప్ తన వ్యూహాన్ని స్పష్టం చేస్తూ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏ పరిస్థితుల్లోనూ ఆ దేశాన్ని అణ్వాయుధాలు సాధించనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సభ్యులకు ఆయన ఒక అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే ఆయుధాలను వీడి లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామని, లేనిపక్షంలో ఖచ్చితమైన మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను, ఆ పరిశ్రమను సమూలంగా నాశనం చేస్తామని, వారి నౌకాదళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అన్నారు. ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్న ఉగ్రవాద ప్రాక్సీ ముఠాలను ఇకపై ఉపేక్షించబోమని, వేలాది మంది అమెరికన్ల మరణానికి కారణమైన ఐఈడీ  దాడులకు చరమగీతం పాడుతా మన్నారు.

మరోవైపు ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ముందస్తుగా అడ్డుకునే క్రమంలో ఇజ్రాయెల్ తన క్షిపణి దాడులను చేపట్టినట్లు టీపీఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు తప్పలేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. ఇరాన్ నుంచి ప్రతిదాడి వచ్చే అవకాశం ఉన్నందున ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) దేశవ్యాప్తంగా సైరన్లను మోగించి, పౌరులను అప్రమత్తం చేశాయి. ప్రజలందరూ తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, బాంబు షెల్టర్లకు వెళ్లాలని ఐడీఎఫ్ సూచించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరడంతో ప్రపంచ దేశాలు ఉత్కంఠగా పరిస్థితులను గమనిస్తున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement