ఇరాన్‌ తీరు ‘అణు’మానాస్పదమే: ఐఏఈఏ  | IAEA stresses urgency to verify Iran nuclear material | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ తీరు ‘అణు’మానాస్పదమే: ఐఏఈఏ 

Feb 28 2026 4:24 AM | Updated on Feb 28 2026 4:24 AM

IAEA stresses urgency to verify Iran nuclear material

వియన్నా: యురేనియం శుద్ధికరణ కార్యకలాపాలను ఇరాన్‌ పూర్తిగా పక్కన పెట్టడంపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) సందేహాలు వెలిబుచ్చింది. ఇజ్రాయెల్‌తో గతేడాది 12 రోజుల యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని అణు వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు దెబ్బ తినడం తెలిసిందే. ‘‘వాటి తనిఖీకి మా అధికారులను ఇరాన్‌ అనుమతించలేదు. 

కనుక అవి ఏ మేరకు దెబ్బ తిన్నదీ, వాటిలో ప్రస్తుతం ఏ మేరకు యురేనియాన్ని నిల్వ చేసిందీ నిర్ధారించలేకపోయాం’’అని ఐఏఈఏ శుక్రవారం తన రహస్య నివేదికలో వెల్లడించింది. దీనిపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరముందని పేర్కొంది. ఐఏఈఏ గత సమాచారం మేరకు ఇరాన్‌ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440.9 కిలోల యురేనియం నిల్వలున్నాయి. అవి కనీసం 10 అణుబాంబుల తయారీకి సరిపోతాయని ఐఏఈఏ డైరెక్టర్‌ జనరల్‌ రఫేల్‌ గ్రోసి చెప్పారు. ఇటీవలి కాలంలో ఇరాన్‌ యురేనియం నిల్వలను విపరీతంగా పెంచుకుందని అమెరికా తదితర దేశాలు అనుమానిస్తున్నాయి. 

ఇజ్రాయెల్‌కు రూబియో 
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమ, మంగళవారాల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. అమెరికా, ఇరాన్‌ నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌తో పాటు లెబనాన్, గాజా శాంతి ప్రణాళిక తదితరాలపై ఇజ్రాయెల్‌ నాయకత్వంతో ఆయన చర్చిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో అమెరికా ఇప్పటికే సైనిక బలగాలను భారీగా మోహరించడం తెలిసిందే. వీలైనంత త్వరగా ఇజ్రాయెల్‌ను వీడాలని అక్కడి తమ దౌత్య సిబ్బందిని అమెరికా శుక్రవారం ఆదేశించింది. దాంతో ఆ్రస్టేలియా తదితర దేశాలు కూడా అదే బాట పట్టాయి. టెల్‌ అవీవ్‌ నుంచి విమాన సేవలను నిలిపేస్తున్నట్టు పలు విదేశీ విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇరాన్‌కు ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిందిగా చైనా, భారత్‌తో పాటు పలు యూరప్‌ దేశాలు తమ పౌరులకు సూచించాయి. ఇప్పటికే అక్కడున్న వారు వీలైనంత త్వరగా దేశం వీడాలని సలహా ఇచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement