breaking news
secret report
-
ఇరాన్ తీరు ‘అణు’మానాస్పదమే: ఐఏఈఏ
వియన్నా: యురేనియం శుద్ధికరణ కార్యకలాపాలను ఇరాన్ పూర్తిగా పక్కన పెట్టడంపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) సందేహాలు వెలిబుచ్చింది. ఇజ్రాయెల్‌తో గతేడాది 12 రోజుల యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని అణు వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు దెబ్బ తినడం తెలిసిందే. ‘‘వాటి తనిఖీకి మా అధికారులను ఇరాన్ అనుమతించలేదు. కనుక అవి ఏ మేరకు దెబ్బ తిన్నదీ, వాటిలో ప్రస్తుతం ఏ మేరకు యురేనియాన్ని నిల్వ చేసిందీ నిర్ధారించలేకపోయాం’’అని ఐఏఈఏ శుక్రవారం తన రహస్య నివేదికలో వెల్లడించింది. దీనిపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరముందని పేర్కొంది. ఐఏఈఏ గత సమాచారం మేరకు ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440.9 కిలోల యురేనియం నిల్వలున్నాయి. అవి కనీసం 10 అణుబాంబుల తయారీకి సరిపోతాయని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసి చెప్పారు. ఇటీవలి కాలంలో ఇరాన్ యురేనియం నిల్వలను విపరీతంగా పెంచుకుందని అమెరికా తదితర దేశాలు అనుమానిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు రూబియో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమ, మంగళవారాల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. అమెరికా, ఇరాన్ నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌తో పాటు లెబనాన్, గాజా శాంతి ప్రణాళిక తదితరాలపై ఇజ్రాయెల్ నాయకత్వంతో ఆయన చర్చిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో అమెరికా ఇప్పటికే సైనిక బలగాలను భారీగా మోహరించడం తెలిసిందే. వీలైనంత త్వరగా ఇజ్రాయెల్‌ను వీడాలని అక్కడి తమ దౌత్య సిబ్బందిని అమెరికా శుక్రవారం ఆదేశించింది. దాంతో ఆ్రస్టేలియా తదితర దేశాలు కూడా అదే బాట పట్టాయి. టెల్ అవీవ్ నుంచి విమాన సేవలను నిలిపేస్తున్నట్టు పలు విదేశీ విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇరాన్‌కు ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిందిగా చైనా, భారత్‌తో పాటు పలు యూరప్ దేశాలు తమ పౌరులకు సూచించాయి. ఇప్పటికే అక్కడున్న వారు వీలైనంత త్వరగా దేశం వీడాలని సలహా ఇచ్చాయి. -
కాంగ్రెస్ రాజీవ్‌తోనే నాశనం!
వాషింగ్టన్: వివిధ దేశాల్లో జరిగే రాజకీయ పరిస్థితులను సమీక్షించి ఓ అంచనాతో రహస్య నివేదికలు తయారు చేసుకోవటం పలు దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలకు అలవాటైన పనే. భారత ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనూ అమెరికా ఐబీ వర్గాలు ఇలానే ఓ నివేదికను రూపొందించాయి. ఆ నివేదిక ఇప్పుడు బహిర్గతం కావడంతో సంచలనంగా మారింది. ఇందిరాగాంధీ హత్యకు దాదాపు రెండేళ్ల ముందే 1983 జనవరి 14న ఈ నివేదికను యూఎస్ కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) తయారు చేసింది. ఒకవేళ అనివార్య కారణాలతో ఇందిర మరణిస్తే ఆమె వారసుడిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుందని అందులో నివేదించింది. ‘రాజీవ్‌గాంధీకి రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రమే. ప్రజలను ఆకర్షించటంలోనే కాదు. జూనియర్ కావటంతో పార్టీని సమర్థవంతంగా నడపటంలోనూ విఫలమై తీరతారు.’ అని పేర్కొంది. ఆయనకు ఇందిరాగాంధీలా రాజకీయ చతురత లేదని, ఒకవేళ రాజీవ్ ప్రధాని అయితే మాత్రం ఆ అధికారాన్ని ఎంతో కాలం నిలబెట్టుకోలేరని, రాజకీయ అస్థిరత ఏర్పడి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తి పార్టీ ఉనికికే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఆ సమయంలో ఇందిరాగాంధీ కేబినెట్లో మంత్రులుగా ఉన్న ఆర్ వెంకట్రామన్, పీవీ నరసింహరావు, ప్రణబ్ ముఖర్జీ, ఎన్డీ తివారీలు ఆ హోదాకు రైట్ ఛాయిస్ అంటూ అభిప్రాయపడింది. ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాఖలైన ఓ పిటిషన్‌కు బదులుగా సీఐఏ ఈ 30 పేజీల నివేదికను ఇండియా ఇన్ ది మిడ్-1980, గోల్స్ అండ్ ఛాలెంజ్ పేరిట బహిర్గత పరిచింది.


