పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్లే స్ఫూర్తిదాయకం కాదు అని చెప్పే కథ. మన చుట్టూ చిన్న చితక పనులు చేస్తూ..నిరంతరం కష్టపడతూ ఉన్నతంగా బతికే స్థాయికి వచ్చినవాళ్లు ఉన్నారు. మనం అటుకేసి చూడం. గొప్ప గొప్పోళ్లు కంటికి కనిపించినట్లు..కష్టజీవులు వైపుకి దృష్టిసారించం. వాళ్లను ఒక్కసారి పలకరిస్తే..కష్టం అంటే ఏంటో..పైకి రావడం ఎలాగో కచ్చితంగా తెలుసుంది. అందుకు ఈ కంటెక్ క్రియేటర్ సోషల్ మీడియా షేర్‌చేసిన ప్రేరణాత్మక స్టోరీనే ఉదాహరణ. ప్రస్తుతం ఈ కథ నెట్టింట వైరల్‌గా మారింది.
డిజిటల్ క్రియేటర్ ఉపేన్ వర్మ స్ఫూర్తిదాయక వీడియోని పంచుకున్నారు. అది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన లస్సీ వ్యాపారితో డిజిటల్ క్రియేటర్ ఉపేన్ వర్మ జరిపిన సంభాషణ కనిపిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో లస్సీ వ్యాపారి ఒక విషాదాన్ని దిగమింగుకుంటూ..సాగించిన తన అద్భుత జర్నీ గురించి మాట్లాడారు. తాను చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబా భారమంతా తనపై పడిందని చెప్పుకొచ్చాడు.
తాను 11 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతను మోసినట్లు తెలిపాడు. అప్పటి నుంచే రోజు కషపడి పనిచేసేవాడినని చెప్పాడు. అప్పట్లో లస్సీ అమ్ముతూ రోజుకి కేవలం రూ. 250లు సంపాదించేవాడినని అన్నాడు. అలా సంపాదించిన డబ్బుతోనే తన తోబుట్టువుల పెళ్లిళ్లు చేశానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాను పెళ్లిచేసుకుని ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని వెల్లడించాడు. తన తండ్రి తమకంటూ ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదని బాధపడుతూనే చనిపోయాడని..ఆ నేపథ్యంలోనే ఆహర్నిశలు కష్టపడి తనకంటూ ఒక ఇల్లు కూడా నిర్మించుకోగలిగానని అన్నాడు.
ప్రస్తుతం దేవుడి దయవల్ల బాగానే సంపాదిస్తున్నానని, ఇప్పుడు లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేల నుంచి రూ. 90 వేలు వరకు ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అదంతా విని కంటెంట్ క్రియేటర్ జీవితంలో అస్సలు ఏ అద్భుతం జరగదని అనుకునేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారని అడగగా..ఆ వ్యక్తి మిత్రులారా కష్టపడి పనిచేయండి, కష్టపడటం ఆపకపోతే..మిమ్మల్ని తప్పక దేవుడు ఆశ్వీరదిస్తాడు, అద్భుతం జరిగినట్లుగా గొప్పవారవుతారని అన్నాడు.
ఆ వ్యక్తితో సంభాషణ ముగిసిన వెంటనే ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూ అనుభవాలలో ఇది అత్యంత అద్భుతమైనదని కంటెంట్ క్రియేటర్ వర్మ అన్నాడు. ఈ వ్యక్తి కథ మీరు ఏదైనా సాధించాలనుకుంటే, దాన్ని సాధించగలరని చూపిస్తుంది.
ఇక్కడ విజయం సాధించడానికి మీకు కావలసిందల్లా దృఢ సంకల్పం ఒక్కటే అంటూ తన సంభాషణను ముగించాడు డిజిటల్ క్రియేటర్ వర్మ. నెటిజన్లు కూడా అద్భుతమైన కథను పంచుకున్నారని, కఠిన వాస్తవాలతో కూడిన ఇలాంటి కథలే మనసుని తాకుతాయంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..)


