రెండు చేతులు కోల్పోయినా చదువును ఆపలేదు. వైకల్యాన్ని అధిగమించి.. విజయం సాధించాడు. కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తాయి. కానీ వాటిని చూసి వెనక్కి తగ్గకుండా.. అదే కష్టాలను విజయానికి మెట్లుగా మార్చుకునే వ్యక్తులే నిజమైన స్ఫూర్తి. జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా.. గెలవాలనే సంకల్పం ఉంటే ఏ అడ్డంకీ మన విజయాన్ని ఆపలేదని నిరూపించిన కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి ప్రయాణమే ఎందరికో కొత్త ఆశను, ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథే ఇది..
చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. అయినా ఆ వైకల్యాన్ని తన లక్ష్యానికి అడ్డంకిగా భావించలేదు. పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో చదువును కొనసాగించాడు. చివరకు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) పరీక్షలో విజయం సాధించి తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. అతడే దౌసా జిల్లాకు చెందిన రాజ్‌వీర్ గుజ్జర్.
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) RAS-2024 నియామక పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రస్తుతం సర్వీసుల కేటాయింపు ప్రక్రియను చేపట్టింది. ఇందులో రాజ్‌వీర్ గుజ్జర్ కూడా విజయం సాధించాడు. దివ్యాంగుల విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించి తహసీల్దార్ సర్వీసుకు ఎంపికయ్యాడు.
దౌసా జిల్లాలోని సాలెంపూర్ గ్రామానికి చెందిన రాజ్‌వీర్‌కు 10 ఏళ్ల వయసులో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి ముందు రోడ్డుపై ఓ బొమ్మ కనిపించడంతో దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. దానితో ఆడుకునేందుకు ప్రయత్నించగానే ఒక్కసారిగా అది పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతడు రెండు అర చేతులను కోల్పోయాడు. అయితే, ఆ ఘటన అతడి జీవితానికి ముగింపు పలకలేకపోయింది. మిగిలిన చేతి భాగాలతోనే రోజువారీ పనులు చేసుకోవడం నేర్చుకున్నాడు. అంతేకాదు.. పెన్నును రెండు చేతులతో పట్టుకుని రాయడం సాధన చేశాడు. అలా పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసిన రాజ్‌వీర్.. చివరకు అదే విధంగా ఆర్‌ఏఎస్ పరీక్షను కూడా రాసి విజయం సాధించాడు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్‌వీర్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. “మీకు ఎలాంటి శారీరక వైకల్యం ఉన్నా.. దాన్ని మీ మనసుపై ఆధిపత్యం చెలాయించనివ్వకూడదు. మనసును బలంగా ఉంచుకోవాలి. సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. నా చదువు సమయంలో విజయం తప్పకుండా వస్తుందని నమ్మేవాడిని. అది కాస్త ఆలస్యంగా వచ్చినా సరే.. ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకూడదు” అని రాజ్‌వీర్ పేర్కొన్నాడు.
చిన్నతనంలోనే ప్రభుత్వ అధికారులను గమనిస్తూ.. తాను కూడా ఒక రోజు అధికారి కావాలని రాజ్‌వీర్ కలలు కనేవాడు. మొదట పోలీస్ అధికారిగా పనిచేయాలని ఆశపడ్డాడు. అయితే, తన వైకల్యం కారణంగా ఆర్‌పీఎస్ సర్వీసులో చేరే అవకాశం లేకపోవడంతో.. ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో అధికారిగా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ లక్ష్యంతో నిరంతరం చదువుపై దృష్టి పెట్టాడు. పెన్నును రెండు చేతులతో పట్టుకుని రాయడాన్ని ప్రత్యేకంగా సాధన చేశాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూనే తన చదువును కొనసాగించాడు.
రాజ్‌వీర్‌కు హిందీ, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. ఆర్‌ఏఎస్ పరీక్షను రెండుసార్లు రాశాడు. తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా మరింత కష్టపడి చదివాడు. ప్రత్యేక కోచింగ్‌పై ఆధారపడకుండా స్వయంగా చదువుకున్నాడు. రెండో ప్రయత్నంలో ఆర్‌ఏఎస్-2024 పరీక్షలో విజయం సాధించడమే కాకుండా.. దివ్యాంగుల విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించాడు. దీంతో రాజస్థాన్ తహసీల్దార్ సర్వీసుకు ఎంపికయ్యాడు. రాజ్‌వీర్ తండ్రి విక్రమ్ సింగ్ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. అతడికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు.
ఇదీ చదవండి: రెప్పపాటులో.. సీసీటీవీలో భయానక దృశ్యాలు


